సాహితీ ప్రక్రియలో కథలకు విశిష్టమైన స్థానం ఉంది. మానసిక ఉల్లాసానికీ, సరికొత్త ఆలోచనా దృక్పథానికీ కథలు తమ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమధ్యకాలంలో కథలకు పెద్దగా ప్రోత్సాహం లభించేది కాదు. అయితే ఇప్పుడు యువ రచయితలు కలం ఝలిపిస్తూ.. కొత్త కొత్తగా రాయడం మొదలెట్టారు. దాంతో కథకు మళ్లీ ప్రాణం వచ్చింది. సాహిత్యాన్ని, కొత్తగా కథలు రాస్తున్నవాళ్లని, ముఖ్యంగా కథల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తెలుగు 360 ‘కథా కమామిషు’ పేరుతో కొత్త శీర్షిక ప్రవేశ పెడుతోంది. వారం వారం ప్రధాన పత్రికలలో ప్రచురితమైన కథల గురించిన ఓ చిన్నపాటి విశ్లేషణ ఇది. కథలు రాస్తున్నవాళ్లకు ప్రోత్సాహకరంగానూ, కథలు రాయాలనుకొంటున్నవాళ్లకు ఉత్ప్రేరణగానూ ఉండాలన్న ఆలోచనతోనే ఈ మా ప్రయత్నం. ఈవారం (మే 19) ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలలో వచ్చిన కథలు, అందులోని ఇతివృత్తాలు, రచయిత శైలిని కాస్త విపులంగా పరిశీలిస్తే…
కథ పేరు: తప్పు చేశాను
రచన: పోల్కంపల్లి శాంతాదేవి
పత్రిక: ఈనాడు
ఈనాడు ఎప్పుడూ సంప్రదాయబద్ధమైన కథలకు పెద్ద పీట వేస్తుంటుంది. కథ ద్వారా ఏదో ఓ సామాజిక సందేశాన్ని చేరవేయాలని ప్రయత్నిస్తుంటుంది. ‘తప్పు చేశాను’ కూడా అలాంటి కథే. అరుణ అనే ఓ టీచర్ కథ ఇది. తెలిసీ తెలియని ప్రాయంలో ప్రేమలో పడి, ఇంట్లోవాళ్లని కాదని ఎంత పెద్ద తప్పు చేసిందో చెబుతూ సాగిన విశ్లేషణ ఇది. ఈ కథని కథగా కాకుండా ఓ స్పీచ్‌లా చూడాలి. ఓ ఉపాధ్యాయురాలు, విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగ పాఠం ఈ కథ. ఓ కథని ఎలాగైనా రాయొచ్చు. ఆ సౌలభ్యం రచయితలకు ఉంది. కాకపోతే.. మరీ ఉపన్యాస ధోరణిలో కథ సా…గడం రక్తి కట్టలేదు. చెప్పే విషయం మంచిదైనా, రచనలో ఎక్కడో ఓ చోట రచయిత తాలుకూ మార్క్ కనిపించాలి. ఈ కథలో అది లేదు. సందేశం చెబితే చాలు, కథ ఎలాగున్నా ఫర్వాలేదు.. అనే నియమంతో కథలు ఎంచుకొంటున్న ఈనాడు – ఆదివారం అనుబంధం విభాగం ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది ఈ కథ చదివితే.
కథ పేరు: కిడ్నాప్
రచన: మణి వడ్లమాని
పత్రిక: సాక్షి
టైటిల్ తో ఆకట్టుకొన్న కథ ఇది. నిజానికి ఇది కూడా త్యాగం, సానుభూతి, పరుల సేవ టైపు కథే. కానీ నడిపించిన తీరు కాస్త కొత్తగా ఉంది. కథలోని ప్రధాన పాత్రల్ని పరిచయం చేసిన తీరు ఆసక్తిగా అనిపిస్తుంది. మహిళ పాత్ర వయసుని దాస్తూ కథ మొదలెట్టడం వల్ల ఇదేదో ప్రేమ కథ అనుకొంటారు. కానీ చివరి వెళ్లే సరికి అనాథల్ని అక్కున చేర్చుకొన్న ఓ పెద్దావిడ కథలా ముగుస్తుంది. జీవితంలో సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన పనిలేదని, ఓ మంచి పని చేసినా చాలని చెప్పడం రచయిత్రి ఉద్దేశ్యం కాబోసు. మూడు పేజీల కథ… క్లుప్తంగా, సింపుల్ గా సాగిపోయే కథనం. ఓవరాల్ గా మనసుల్ని కుదిపేసే అనుభూతి ఇవ్వకపోయినా… ‘ఓకే’ అనిపించే ఫీలింగ్ తీసుకొచ్చే కథ ఇది.
కథ పేరు: పురహితుడు
రచన: యాజి
పత్రిక: ఆంధ్రజ్యోతి
దైవం మానుష్య రూపేణా అంటారు పెద్దలు. పశువుకి కాస్త గ్రాసం, మనిషికి కాస్త సాయం.. ఇదే కదా దైవత్వం! భక్తులు దేవుడికి తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పిస్తుంటారు. కానీ దేవుడు నిజంగా ఉంటే అలాంటివేం ఆశించడు. ఆ కానుకలు ఎవరికి చేరాలో, వాళ్లకు చేరితేనే ఆ దేవుడికైనా తృప్తి. ఈ సందేశాన్ని పంపిన కథ.. ‘పురహితుడు’. కామేశ్వరశాస్త్రి అనే పురోహితుడు రాములవారికి కానుక ఇచ్చేందుకు అయోధ్యకు చేసే ప్రయాణం ఈ కథ. మధ్యలో తన విలువైన వస్తువు పోవడం, ఓ ముస్లిం కామేశ్వరశాస్త్రికి సహాయ పడడం, ఆ తరవాతి పరిణామాలూ.. ఇదే క్లుప్తంగా కథ. ముగింపు డ్రమెటిక్‌గా ఉన్నా, ఈ సమాజానికి కావాల్సింది అదే. దేవుడి హుండీలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుందని చెబుతుంటారు. ఆ డబ్బులతోనే ఓ మంచి పని చేస్తే అంతకు మించిన ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ఓ ఇరికింట్లో ఓ వైపు కామేశ్వర శాస్త్రి మహా మృత్యుంజయ మంత్రం జపిస్తుంటే, మరోవైపు ముస్లిం సోదరుడు మగ్రీబ్ నమాజ్ చదివే దృశ్యం కళ్ల ముందు కదులుతుంటే.. ఓ స్వాంతన లభిస్తుంది. ఓసారి చదవదగిన కథ.
కథ పేరు: బుడు బుక్క
రచన: వేముగంటి శుక్తిమతి
పత్రిక: నమస్తే తెలంగాణ
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ ఒకటి ఉంటుంది. ఏ వృత్తినీ తక్కువ చేయకూడదు. ఆఖరికి మన ఇంటి ముందుకొచ్చి.. ‘అంబ పలుకు జగదాంబ పలుకు’ అంటూ చల్లగా ఆశీర్వదించే బుడబుక్కలవాళ్లని సైతం. ఒకప్పుడు.. సంక్రాంతి వేళ ఇంటికి బుడబుక్కలోళ్లొస్తే ఆ కళే వేరుగా ఉండేది. చాటంత బియ్యం భిక్షగా పోసి, బైరాగుల ఆశీర్వాదం తీసుకొనేవాళ్లం. అయితే ఇప్పుడు ఆ బైరాగులు బిచ్చగాళ్లుగా మారిపోయారు. ఏ ఇంటి ముందూ వాళ్లకు, వాళ్ల వృత్తికీ విలువ దక్కడం లేదు. ‘చల్లగుండాలే’ అంటూ దీవించే నోళ్లు మూతపడుతున్నాయి. ఆ కళ్లు.. కన్నీళ్లని నింపుకొంటున్నాయి. ‘బుడు బుక్క’ కథలో రచయిత్రి అంతర్మథనం ఇదే. స్వచ్చమైన తెలంగాణ యాసలో సాగే కథ ఇది. బైరాగుల్ని, బుడబుక్కలోళ్లనీ చిన్నచూపు చూడొద్దని, చీదరించుకోవద్దని విన్నవించుకొన్న కథ.
-అన్వర్