లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడే ఇందుకు ప్రధాన కారణం. మల్కాజ్ గిరి లోక్ సభతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరిగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సోదరి నివేదిత పోటీలో ఉండగా… గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ తరఫున టి.ఎన్. వంశ తిలక్ పోటీ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ లో సొంతంగా ఖాతా తెరవాలని కాంగ్రెస్ పట్టుదలతో కనిపించగా… గ్రేటర్ లో బీఆర్ఎస్ పట్టు సడలలేదని నిరూపించుకునేందుకు ఈ బైపోల్ లో ఎలాగైనా నెగ్గాలని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ నెగ్గి అసెంబ్లీలో సంఖ్యా బలం పెంచుకోవాలని బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేసింది.
అయితే, ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది గ్రేటర్ పరిధిలో ఉత్కంఠ నెలకొంది. సాయన్న చేసిన అభివృద్ధితో పాటు సానుభూతి ఓట్లు బీఆర్ఎస్ ను గట్టెక్కిస్తాయని గులాబీ క్యాడర్ లో చర్చ జరుగుతుండగా…అధికార పార్టీ అండదండలు, కంటోన్మెంట్ పరిధిలో పలు సమస్యలకు రేవంత్ పరిష్కారం చూపడంతో ఓటర్లు హస్తం పార్టీని ఆశీర్వదిస్తారని అంచనా వేస్తోంది.
బీజేపీ అభ్యర్థి తిలక్ మాత్రం మోడీ చరిష్మా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసిన వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని బలపరచాలని ఫిక్స్ అయి, బీజేపీకి ఓటేసి ఉంటారని లెక్కలు వేస్తున్నారు. ఇలా ఎవరి లెక్కలతో వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు. కంటోన్మెంట్ లో విజయం ఎవరిని వరిస్తుందో జూన్ 4న తేలనుంది.