ఎన్నికల తర్వాత ఏపీలో జరిగిన అల్లర్లపై ఏర్పడిన సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించింది. రెండు రోజుల పాటు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి, అల్లర్ల వెనుకున్న కారణాలు… అల్లర్ల వెనుకున్న నేతల విషయాలను ప్రాథమికంగా సేకరించింది.
మొత్తం 150 పేజీల నివేదికను సిద్ధం చేసిన సిట్… 33ప్రాంతాల్లో అల్లర్లు జరిగినట్లు పేర్కొంది. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించినట్లు పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని, కొందరు పోలీసు అధికారులు నేతలతో చేతులు కలిపి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే నమోదైన కేసులనూ స్టడీ చేసిన సిట్… ఎఫ్.ఐ.ఆర్ లలో కొత్త సెక్షన్లను నమోదు చేయబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాథమిక నివేదికలో అల్లర్లకు కారణాలతో పాటు ఎన్నికల ఫలితాల రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యేకంగా పేర్కొంది. ఈ నివేదికను ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్ కూడా అందించనున్నారు.