ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
పోలింగ్ ముగిసిన రోజు నుంచే వైసీపీ నేతల వ్యాఖ్యల్లో తేడా స్పష్టంగా కనిపించింది. ఓడిపోతున్నట్లు ప్రకటించకపోయినా పరోక్షంగా ఓటమికి కారణాలు అప్పుడే మొదలు పెట్టేయడం… వైసీపీ అధికారం కోల్పోతుందన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఒకరు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తే, మరొకరు రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు.
సాధారణంగా ఇలాంటి ఆరోపణలు ఓటమి ఎదురు అవుతుందని అంచనా వేసే పార్టీల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఈ తరహ ఆరోపణలు చేసిన అభ్యర్థులు, పార్టీ గెలిచిన సందర్భాలు తక్కువ. తాజాగా వైసీపీ నేతలు మరోసారి బయటకు వచ్చి అలాంటి ఆరోపణలే చేశారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కు అయ్యారని, అందువల్లే ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఆరోపించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఇలాంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుంచే వింటుంటాం. ఇప్పుడు వైసీపీ నేతల వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీ నాయకుల తరహాలో ఉన్నాయంటూ అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు వైసీపీ రెడీ అయిందంటూ కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.