ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ వ్యాఖ్యలు ప్రధానమంత్రి స్థాయిలోని కావని అందరికీ తెలుసు. కానీ తన ప్రధానమంత్రి స్థాయిని నిలుపుకోవాలంటే… తాను దిగజారక తప్పదని ఆయనకు ఇంకా బాగా తెలుసు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేక ..మోదీలో ఓటమి భయమంటూ ప్రచారం చేసుకుంటూ టైం పాస్ చేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాజకీయం ఎలా చేయాలో తెలుసు. ఓట్లు ఎలా సంపాదించాలో తెలుసు. దానికి తగ్గట్లుగానే ఆయన రాజకీయం చేస్తున్నారు ఏ ప్రాంతానికి వెళ్తే ఎలా ప్రచారం చేస్తే ఓట్లు వేస్తారో ఆయన ఔపాసన పట్టారు.దానికి తగ్గట్లగానే ఆయన తన ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు. దేశంలో అభివృద్ధి చేశామంటే ఓట్లు వేసే రోజులు ఇంకా రాలేదు. ఓట్లు వేయడానికి ఇంకా కులం, మతం, ప్రాంతాల వంటి భావోద్వేగాలే ప్రాతిపదికలు. మోదీ ఈ విషయాన్ని తన దృష్టిలో ఉంచుకుని ప్రచారం చేస్తున్నారు.
తాము చేసిన అభివృద్ధి, చేసిన పనుల గురించి చెప్పుకోకుండా మతం కార్డు వాడుతున్నారు కాబట్టి మోదీ వెనుకబడిపోయారని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే్ ప్రచారం చేస్తున్నారు. కానీ మోదీ ప్రచార వ్యూహాన్ని గుర్తించలేకపోతున్నారు. మోదీ ట్రాప్ లో పడిపోయి.. ఆయనకు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. మోదీ చేసే ముస్లిం వ్యతిరేక ప్రకటనలపై స్పందిస్తే ఎవరికి లాభం అనే చిన్న విషయాన్ని గుర్తించలేక హిందూ సెంటిమెంట్ పెంచేదుకు కాంగ్రెస్ తన వంతు పాత్ర పోషిస్తోంది.
మోదీ మతం కార్డు వాడటం.. రాజకీయంగా ఆయన స్థాయికి తగని ప్రచారం. కానీ మోదీ ఎప్పుడూ తన స్థాయి ఇది అంటూ గిరి గీసుకోలేదు. రాజకీయాల్లో విజయానికి అడ్డదారులు ఉండవు.. గెలుపు గెలుపే.. ఓటమి ఓటమే అనే పాలసీ ఆయనది. దాన్ని విపక్షాలు అర్థం చేసుకునేలోపే ఎన్నికలు ముగిస్తున్నారు.