కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు సాధిస్తుందని మొదటి నుంచి చార్ సౌ పార్ నినాదం గట్టిగా వినిపించారు.
తక్కువ సీట్లు వస్తాయనే ఆందోళనతోనే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి , ఓట్లు దండుకునే వ్యూహంలో భాగంగా బీజేపీ చార్ సౌ పార్ నినాదం ఎత్తుకుందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పైగా నార్త్ లో బీజేపీపై గతంలోలా సానుకూలత కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ వాదనను ఓటర్లు విశ్వసించారని అనుకున్నారేమో ఏమో, బీజేపీ అగ్రనేతలు గడిచిన కొద్ది రోజులుగా ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యపై బుల్డోజర్లను ప్రయోగిస్తోందని, రెండు ఇల్లులు ఉంటే ఓ ఇంటిని స్వాధీనం చేసుకుంటుందని ఆరోపణలను స్టార్ట్ చేసింది. మొదట తెరపైకి తీసుకొచ్చిన చార్ సౌ పార్ నినాదం ఎక్కడా ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అయింది.
ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతుండటంతో తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని చార్ సౌ పార్ నినాదాన్ని మళ్లీ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. అంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి, మళ్లీ గెలిచేది బీజేపీనేననే వాతావరణం క్రియేట్ చేసిందుకు ఈ నినాదాన్ని జపిస్తున్నారని అందుకు తాజా పరిణామాలే ఉదాహరణ అంటూ విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.