రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇదో పొలిటికల్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి పాత్రకు రాజకీయ పరంగా కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేయాలనుకొంటాడు. ఆ పార్టీకంటూ కొన్ని సిద్దాంతాలు ఉంటాయి. అవి ‘జనసేన’ సిద్దాంతాలకు దగ్గరగా ఉంటాయని టాక్. జీరో బడ్జెట్ రాజకీయాలు, కులాలకు అతీతంగా రాజకీయాలు చేయడం, పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం ఇవన్నీ ‘జనసేన’ సిద్ధాంతాల్లో కొన్ని. ఇలాంటివే… ‘గేమ్ ఛేంజర్’లో కనిపించనున్నాయట. చరణ్ పార్టీ అజెండా, మానిఫెస్టో.. ఇవన్నీ `జనసేన`ని గుర్తు చేసేలా సాగుతాయని తెలుస్తోంది. ఇటీవల ఏపీ ఎన్నికలు జరిగినప్పుడు చరణ్ పిఠాపురం వెళ్లి మరీ తన మద్దతు తెలిపాడు. అది ప్రత్యక్షంగా అయితే.. `గేమ్ ఛేంజర్` ద్వారా పరోక్షంగానూ తన సపోర్ట్ ఇస్తున్నాడన్నమాట. ‘గేమ్ ఛేంజర్’ ఎన్నికలకు ముందు విడుదలైతే.. ‘జనసేన’కు మరింత బూస్టప్‌గా ఉండేది. కానీ ఆలస్యం అవుతోంది. ఈ సెప్టెంబరులో ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సూర్య, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు.