మనుషుల్ని అడ్డంగా నరికేసినా పర్వాలేదు… ఈవీఎంలను ధ్వంసం చేసినా తప్పు లేదు.. ఏం చేసినా సరే అధికారంలోకి రావాలన్నది వైసీపీ స్టైల్. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న చోట్ల ఎన్ని ఘోరాలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముందుగానే అనుకూల అధికారుల్ని నియమించుకుని ఇష్టారీతిన రిగ్గింగ్ చేయాలనుకున్నారు. కానీ ఈసీ అధికారుల్ని మార్చే సరికి చెలరేగిపోయారు. ఘోరాలకు పాల్పడింది కాక ఈసీ అధికారుల్ని మార్చడం వల్లనే జరిగిందంటూ ఎదురుదాడి చేస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం పగులగొడుతూ వీడియోలో దొరికిపోయారు కాబట్టే ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ. కానీ మాచర్ల నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అనేది ఉందని ఎవరైనా చెప్పగలరా ?. మాచర్ల మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డుకు ఎన్నిక జరగలేదు.. .మొత్తం ఏకగ్రీవం అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీలు దేనికీ ఎన్నికలు జరగలేదు. పోలీసులు, వ్యవస్థ పూర్తిగా పిన్నెళ్లి రౌడీయిజానికి దాసోహం అయ్యాయి. అప్పట్నుంచి ప్రారంభమైన ఈ ఘోరాలు .. సాధారణ ఎన్నిల్లోనూ జరిగాయి.
పిన్నెల్లి ఎంత మంది తన ప్రత్యర్థుల ప్రాణాలు తీశాడో లెక్కలేదు. చివరికి తాను ఈవీఎం పగలగొడుతూండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ తల కూడా అదే రోజు పగులగొట్టారు. తాము చేసే ఘోరాల్ని ఎదుటి వారే చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ… మీడియా, సోషల్ మీడియాల్లో ప్రచారం చేసుకుని అదే రాజకీయం అనుకుంటున్నారు. వ్యవస్థలన్నీ ఇంకా కళ్లు తెరవలేదు. ఈవీఎం పగులగొట్టి పది రోజుల తర్వాత వీడియో బయటకు వస్తే.. అప్పుడు కేసులో ఆయన పేరు చేరుస్తున్నారు. చేతకాని వ్యక్తుల చేతుల్లో వ్యవస్థలు ఉంటే.. రౌడీలదే రాజ్యం అవుతుంది. మాచర్లలో ఇంత కాలం అదే జరిగింది.