టీవీ 9లో అంతర్గత సెగ బాగానే రగులుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఫోన్ల వినియోగాన్ని నియంత్రిస్తూ.. సాఫ్ట్ వేర్ కంపెనీల్లోలా ఫోన్లను సెక్యూరిటీ దగ్గర డిపాజిట్ చేసి వెళ్లాలని పని అయిపోయిన తర్వాతనే తీసుకోవాలని ఆంక్షలు పెట్టారు. ఎప్పుడూ లేనిది ఇలా ఫోన్లపై ఆంక్షలు పెట్టడం వెనుక ఏదో బలమైన కారణం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టీవీ9 ఆఫీసుకు వైసీపీ నేతల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. డిస్కషన్లకు లేకపోతే ఇంటర్యూలకు వచ్చే వారు కాదు. ఇతర వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు. రెండు రోజుల కిందట ప్రభుత్వ సలహాదారుడిగా మారిన మాజీ సాక్షి టీవీ జీతగాడు నేమాని భాస్కర్ కూడా వచ్చారు. ఆయన వచ్చిన విషయం వీడియోలతో సహా బయటకు పోయింది. దీంతో రజనీకాంత్ తీసేస్తున్నారని.. టీవీ9ను.. నేమాని భాస్కర్ చేతుల్లో పెడుతున్నారన్న చర్చ ప్రారంభమయింది. ఇదంతా ఫోన్ల వల్లేనని రజనీకాంత్ అనుకోవడంతో వాటిపై పడినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా మీడియాలో పని చేసే వారికి ఫోన్లు లేకపోతే కాళ్లు చేతులూ ఆడవు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీడియా , సోషల్ మీడియా ద్వారా అప్ డేటెడ్ గా ఉండాలి. కానీ ఆఫీసులో సిబ్బందికి ఫోన్లను బ్యాన్ చేయడంతో వారి పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినా సెల్ ఫోన్లు వాడకంలోకి వచ్చినప్పటి నుండి లేని ఇబ్బంది.. ఇప్పుడెందుకు అన్నదే ఉద్యోగుల్లో వస్తున్న అసలు ప్రశ్న.