వాళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకున్నారు. సొంత గూడు వస్తుందని డబ్బులు మొత్తం బిల్డర్ చేతిలో పెట్టారు. ఆయన మోసం చేశాడు. కేసులు నమోదయితే దర్యాప్తు చేసి ఆ బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారి మోసం చేసిన వ్యక్తి వద్ద లంచం తీసుకుని బాధితుల్నే భయపెట్టారు. ఇంత ఘోరం ఉంటుందా ?. ఈ పని చేసింది ఏసీపీ ఉమామహేశ్వరరావు. ఆయనపై ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాహితి ఇన్ ఫ్రా అనే సంస్థ పేరుతో బూదాటి లక్ష్మినారాయణ అనే వైసీపీ నేత, మాజీ టీటీడీబోర్డు సభ్యుడు హైదరాబాద్ లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కనీసం రెండు వందలకోట్లుకుపైగా వసూలు చేశారు. కానీ అసలు నిర్మాణమే ప్రారంభించలేదు. చివరికి బోర్డు తిప్పేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు మొత్తం నీరు గాల్చేశారు. బాధితులకు వ్యవస్థపై నమ్మకం లేకుండా చేశారు. ఈ సమాజంలో మోసగాడే గొప్పన్నట్లుగా వ్యవహరించారు.
ఈ ఏసీపీ డబుల్ మర్డర్ కేసులో నిందితుల్ని కాపాడారు. వారి వద్ద నుంచి నలభై లక్షలు తీసుకుని దొరికిపోయారు. అప్పట్లో సస్పెన్షన్ కు గురయి మళ్లీ వచ్చారు. తనకు ఉన్న ఖాకీ చొక్కాను అడ్డం పెట్టుకుని మోసగాళ్లను కాపాడుతూ.. వారు ఇచ్చే లక్షలతో ఆస్తులు పెంచుకుంటూ పోయారు. వ్యవస్థ మీద నమ్మకంతో ఫిర్యాదులు చేసి.. న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం సర్వం పోగొట్టుకుని .. రోడ్డున పడ్డారు. ఇలాంటి అధికారులను తక్షణం సర్వీస్ నుంచి డిస్మిస్ చేయకపోతే.. ఇతర అధికారులకూ ధైర్యం వస్తుంది. తాము ఏం చేసినా ఎదురుండదని దోపిడీలకి పాల్పడతారు.