ఏపీ ప్రభుత్వం అప్పులు వచ్చే అవకాశం ఉంటే వేల కోట్లు తీసుకుంటోంది. ఆర్బీఐ దగ్గర నుంచి గత రెండు నెలల కాలంలో పదహారు వేల కోట్లు తీసుకుంది. ఇక బయట కూడా అప్పులు చేసింది. అయితే ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. తమ బిల్లులు ఇవ్వడం లేదని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు చికిత్సలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. బిల్లులు ఇవ్వండి మహా ప్రభో అని చిన్న చిన్న కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ పడిగాపులు పడుతున్నారు.
అన్నింటికి మించి బటన్ నొక్కిన పథకాలకు నిధులు జడమ చేయాలని లబ్దిదారులు పోరు పెడుతున్నారు. పోలింగ్ రెండు రోజుల ముందు రూ. 14వేల కోట్లను జమ చేస్తామని హడావుడి చేశారు. పోలింగ్ ముగిసిన పది రోజుల వరకూ కనీసం పది శాతం కూడా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయలేదు. కానీ ప్రతీ వారం వేల కోట్ల అప్పులు తీసుకు వస్తూనే ఉన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్యాదీవెన, కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు జగన్ బటన్ నొక్కి 5 నెలలు అయినా నిధులు జమ చేయలేదు.
పోలింగ్ అయిపోయిన తర్వాత ఇక ఓటర్లతో పనేముందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వేల కోట్లను దారి మళ్లిసున్నారని గవర్నర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ కారణంగా చాలా స్వల్పంగా పథకాలకు నిధులు విడుదల చేశారు. తర్వాత సైలెంటయ్యారు. ప్రస్తుతం ప్రజాతీర్పు ఈవీఎంలలో ఉంది. అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. బాధ్యతల్లో ఉన్న అధికారులు మరితం సిన్సియర్ గా వ్యవహరించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అధికారులు ప్రజలకు ఆర్థిక పరిసితి గురించి.. అప్పులు తెస్తున్న నిధుల గురించి.. వాటి వినియోగం గురించి ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటిది చేయడం లేదు.