మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రైతుల కష్టాలు పదేళ్ల తర్వాత గుర్తుకొచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో రైతుల సమస్యలపై ఏనాడూ స్పందించని కేటీఆర్ తాజాగా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు క్యూకట్టిన ఫోటోను ఎక్స్ లో షేర్ చేసి ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు…6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతం అంటూ పేర్కొన్నారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడి చూస్తున్నామన్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు రైతుల సమస్యలను ప్రస్తావించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్దరించామని బీఆర్ఎస్ గొప్పగా ప్రచారం చేసుకుంది. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రైతాంగాన్ని దివాళా తీయిస్తే తమ పదేళ్ల పాలనలోనే రైతును రాజు చేశామని, ఆర్థికంగా పటిష్టం చేశామని చెప్పుకున్నారు. రైతుకు ఇక కష్టాలు తొలగిపోయాయని ప్రకటించిన బీఆర్ఎస్… కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన ఆరు నెలలకే రైతులకు కష్టాలు మొదలు అయ్యాయని చెప్పడమంటే రైతులను బీఆర్ఎస్ ఆర్థికంగా నిలదోక్కుకునేలా చేసింది ఉత్తిమాటేనా..? అనే విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ మాగాణం బంగారమయమైందని, మరో పదేళ్లకు సరిపడా అభివృద్ధి చేసినట్లుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న కేటీఆర్… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే అదంతా అదృష్యమైనట్లు వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. రైతుల విషయంలో బీఆర్ఎస్ ఇప్పట్లో కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నిస్తే తమ పాపాలను తవ్వి తీసుకోవడమే అవుతోంది. మద్దతు ధర అడిగినందుకు రైతులకు బేడీలు వేసిన చరిత్ర ఆ పార్టీ హయంలోనే జరిగింది. రైతు ఆత్మహత్యలు ఉండవని ప్రకటించినా రికార్డ్ స్థాయిలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నా స్పందించని కేటీఆర్ … అధికారం కోల్పోయాక ప్రేమను కనబరిచినా ఇప్పటికప్పుడు రైతాంగం ఆపార్టీని విశ్వాసంలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.