పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఎన్నికల కమిషన్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం సంఘటనపై వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించడంతో సీఈసీకి ఈసీ ఏం చెబుతుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం… కేసు పెడితే నిందితుడిగా చేర్చి పిన్నేల్లిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. కేసు పెట్టకపోతే బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. అయితే, పిన్నెల్లి విధ్వంసం సృష్టించినా ఎన్నికల సంఘం కేసు పెట్టలేదని తెలుస్తోంది.
ఒకవేళ కేసు పెట్టినా ఆయన అరెస్ట్ చేయలేదంటే వ్యవస్థలను వైసీపీ మేనేజ్ చేస్తున్నట్లే. అయినా, వైసీపీ నేతలు మాత్రం మీడియా ముందుకు వచ్చి ఈసీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈసీ కూటమి డైరక్షన్ లో పని చేస్తోందని ఆరోపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే పిన్నెల్లి వ్యవహారం వెలుగు చూడటంతో ఈసీని కూడా వైసీపీ మేనేజ్ చేసింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి పిన్నెల్లి వ్యవహారంతో ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ప్రస్తుతం పిన్నెల్లి అజ్ఞాతంలో ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సాయంత్రంలోగా ఆయన ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
అయితే, హైదరాబాద్ శివారులో పిన్నెల్లి డ్రైవర్ పోలీసుల నుండి తప్పించుకున్నారన్న వార్తలొచ్చాయి. సంగారెడ్డి దగ్గరలో కారును వదలివెళ్లారు. అయితే, డ్రైవర్ ఒక్కడే ఉన్నాడా…? పిన్నెల్లి కూడా ఉన్నారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.