తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, సీఎం రేవంత్ రెడ్డితో సమానమైన గుర్తింపు ఇస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ ను జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించిన అధిష్టానం… తాజాగా భట్టికి కూడా అదే తరహాలో ప్రాధాన్యత ఇచ్చింది. ఆయనకు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల ప్రచార భాద్యతలు అప్పగించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నిజానికి తెలంగాణకు చెందిన మంత్రులు ఇటీవల యూపీ, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చేశారు. కానీ, భట్టికి మాత్రం రెండు రాష్ట్రాలకు ఎన్నికల ప్రచార ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఆయన అక్కడే ఉండి ప్రచార సరళిపై ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార తీరు తెన్నులపై భట్టి ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నారు. అభ్యర్థులను ప్రచారంలో మరింత దూకుడు పెంచేలా సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
మొదట రేవంత్ కు మాత్రమే జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారం విషయంలో బాధ్యతలు అప్పగించిన అధిష్టానం భట్టికి ఆ తర్వాత ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ప్రచార బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరుగుతోంది. అయితే, కర్ణాటక పాలసీనే తెలంగాణలోనూ అమలు చేయాలనే ఉద్దేశ్యంతోనే భట్టికి సైతం ప్రచార బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో సీఎంకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో డిప్యూటీ సీఎంకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. దీంతో పార్టీకి లాయలిస్టుగా సేవలందించిన భట్టికి సీఎం రేవంత్ తరహాలోనే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఫలితంగా సీఎం, డిప్యూటీ సీఎంలకు హైకమాండ్ కల్పిస్తోన్న ప్రాధాన్యత విషయంలో ఇద్దరు నేతలు ఎలాంటి అసంతృప్తికి గురి కాకుండా ఉంటుందని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.