తెలంగాణలో మళ్లీ బలపడాలంటే ఏపీలో వైసీపీ గెలవాలని బీఆర్ఎస్ గట్టిగా కోరుకుంటోంది. కూటమి గెలిస్తే బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు అవుతుందని గులాబీ నేతలు గుసగులాడుకుంటున్నారు. వైసీపీ గెలిస్తే ఎలాగూ తెలంగాణతో నీటి వాటాల విషయంలో వివాదం తలెత్తుతుందని..దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చవచ్చుననేది బీఆర్ఎస్ ధీమా. అలా మళ్లీ రాష్ట్రంలో మునుపటిలా ఆదరణ పొందవచ్చునని లెక్కలు వేసుకుంటోంది.
చంద్రబాబు సారధ్యంలోని కూటమి గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి నీటి, విద్యుత్ పంపకాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కరించుకోగలరు. చంద్రబాబు – రేవంత్ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం ఉండటంతో ఇద్దరిలో ఎవరూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వివాదాలకు వెళ్ళరని, సానుకూల వాతావరణంలో చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకుంటారని బీఆర్ఎస్ లో అంతర్గతంగా సాగుతోన్న చర్చ. అదే జరిగితే సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకురావడం బీఆర్ఎస్ కు కష్టమే.
వీటన్నింటిని అంచనా వేసిన బీఆర్ఎస్ ఏపీలో జగన్ రెడ్డి గెలవాలని కోరుకుంటోంది.రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెదిలేందుకు ఎలాగూ జగన్ ఆసక్తి కూడా చూపరని తద్వారా ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలు ఖాయమని అది బీఆర్ఎస్ ఉనికికి జీవం పోసినట్లేనని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ కు 2019 ఎన్నికల్లో ఫండింగ్ చేయడంతో.. ఏపీలో మళ్లీ గెలిస్తే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు జగన్ అండగా ఉంటారని గులాబీ దళం నమ్ముతోంది.
ఇలా పక్క రాష్ట్రంలో ఎవరు గెలిస్తే ప్రయోజనమని చర్చిస్తోన్న బీఆర్ఎస్.. వైసీపీ గెలుపుపై దింపుడు కళ్ళెం ఆశలు పెట్టుకుంది. ఫ్యాన్ పార్టీ గెలుపు అసాధ్యమని రాష్ట్రంలో కూటమి గెలుపొందే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు అందటం ఆపార్టీని నైరాశ్యంలోకి నేట్టేశాయి.