బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు సొంత అభ్యర్థిని నిండా ముంచినట్లయింది. నాలుగు రోజుల కిందట బీఆర్ఎస్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గురించి గొప్పగా చెప్పేందుకు ఆయన బిట్స్ పిలానీలో చదువుకున్నాడన్నారు. అంత వరకూ ఆగితే బాగుండేది.. కానీ ఇటు వైపు బిట్స్ పిలానీ ఉంటే అటు వైపు పల్లీబఠాణీ ఉందన్నారు.
కేటీఆర్ ఉద్దేశం మనుషుల్ని పోల్చడం కావొచ్చేమో కానీ ఆయన వ్యాఖ్యలు అలా లేవు. బిట్స్ పిలానీలో చదివిన వాళ్లే గొప్ప.. మిగిలిన వాళ్లు పల్లీబాఠాణీంతా తేలిక అన్నట్లుగా జనంలోకి వ్యాఖ్యలు వెళ్లాయి. దీన్ని కాంగ్రెస్ అందుకుంది. గ్రాడ్యూయేట్స్ అందర్నీ కేటీఆర్ కించ పరిచారని విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. బిట్స్ పిలానీలు ఓట్లు వేయరు. ఓటు కోసం కూడా దరఖాస్తు కూడా చేయరు. చేసినా రెండు, మూడు వందల మంది కూడా ఉండరు. మిగతా ఓటర్లంతా కేటీఆర్ చెప్పే పల్లీబఠాణీలే
గ్రాడ్యూయేట్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉండటంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక.. తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అంటూ ఆరోపణలు ప్రారంభించారు. రాకేష్ రెడ్డి కన్నా.. మల్లన్నకే ఎక్కువ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పెద్దలు అహంకారంతోనో… దూకుడుతోనో చేస్తున్న తప్పులే ప్రత్యర్థులకు లాభంగా మారుతోంది.