రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయన తాజాగా ఓ జర్నలిస్టుకు తన వంతు సాయం అందించారు.
ఇటీవల ప్రభు అనే జర్నలిస్టు అనారోగ్యంతో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు చెప్పి యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలని తేల్చారు వైద్యులు. అందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. ప్రభు చిరంజీవికి తెలిసిన వ్యక్తే కావడంతో మెగాస్టార్ ను సంప్రదించి విషయం వివరించారు. ఆరోగ్యంపై ఆందోళన చెందకు.. నేనున్నానని ప్రభుకు భరోసా ఇచ్చారు చిరు.
హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ వైద్యులకు ఫోన్ చేసి ప్రభు వైద్యానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బైపాస్ సర్జరీ చేయకుండా స్టంట్స్ వేసి ప్రాబ్లమ్ క్లియర్ చేసారు. ఆసుపత్రిలో ప్రభు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అన్ని తానై చూసుకున్నారు చిరంజీవి. ప్రభు తాజాగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తాను చిరంజీవికి రుణపడి ఉంటానని ప్రభు కృతజ్ఞతలు చెప్పగా…చిరు సాయానికి జర్నలిస్టు సంఘాలు కూడా థ్యాంక్స్ చెప్పాయి.