ఎన్టీఆర్ 101వ జయంతి. శతజయంతి ఉత్సవాలను ప్రపంచం అంతా తెలుగువారు జరుపుకున్నారు. 101వ జయంతి కూడా అదే విధంగా స్మరించుకుంటున్నారు. మరో వందేళ్లు అయినా మసకబారని తేజం నందమూరి తారక రామారావు. తరాలు మారుతున్నా.. మనుషుల మెదళ్లు కులం క్యాన్సర్తో నిండిపోతున్నా.. తెలుగు జాతికి ఆయన తెచ్చిన గుర్తింపును మాత్రం ఎవరూ చిన్న బుచ్చే ప్రయత్నం చేయలేరు. అదే ఆయన గొప్పతనం.
కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి రైతుబిడ్డగా పయనం సాగించి.. సినీ, రాజకీయ రంగాల్లో .. చెరగని సంతకంగా మారిన యుగపురుషుడు ఎన్టీఆర్. సినిమాల్లో తన ముద్ర ఎంత బలంగా వేశారో.. రాజకీయాల్లోనూ అలాగే మేరునగధీరుడిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసిన ప్రజానేత.
ముఖ్యమంత్రిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్ వ్యవస్థలను రద్దుచేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేశారు. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు.
తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం పేదల పెన్నిధిగా జీవించారు. కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్ టి ఆర్. రాజకీయ వ్యూహాల్లో ఆయన కుల చట్రంలో ఇరుక్కుపోవచ్చు కానీ.. ఆయన ఇచ్చిన గుర్తింపు .. తెలుగువారికి ప్రత్యేకం. ఆయన ప్రభ మరో వందేళ్లయినా మసకబారదు.