కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పై స్కామ్ ఆరోపణలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి.తనపై ఆరోపణలు రేవంత్ రెడ్డి ప్లానని ఉత్తమ్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఉత్తమ్ పరోక్షంగా వెల్లడించారు. ఈ వ్యవహారం మొత్తంగా అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణలతో హైలెట్ అవుతోంది. మహేశ్వర్ రెడ్డి వారం ముందు రేవంత్ రెడ్డితో మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి భేటీ అయ్యారు.
ఈ భేటీ ప్రస్తావనను ఉత్తమ్ తీసుకు వచ్చారు. వినతిపత్రాలు తీసుకొచ్చి సిఎం దగ్గరికి పోయి లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్మెంట్ విషయాలను మహేశ్వర్ రెడ్డి మాట్లాడుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. అంటే.. తనపై ఆరోపణలకు అక్కడే కుట్ర జరిగిందని ఆయన చెప్పకనే చెప్పారు. ఉత్తమ్ ను కాపాడేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ చీఫ్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయన ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ స్కాంలో ఉత్తమ్ కన్నా రేవంత్ ప్రమేయం ఎక్కువగా ఉందని ఆరోపించారు.
అయితే వెంటనే మహేశ్వర్ రెడ్డికూడా రంగంలోకి దిగారు. మీ సీఎంను మీరు అనుమానిస్తున్నారని ఉత్తమ్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి అనుమతితోనే రేవంత్ ను కలిశానని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహరంలో స్కాం కన్నా రాజకీయం ఎక్కువగా కనిపిస్తూండటం.. తెలంగాణ రాజకీయవర్గాల్లోకలకలం రేపుతోంది. అసలు స్కాం జరిగిందో లేదో కానీ..ఇందులో నేతలపై బురద చల్లడానికే అంతర్గత రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ వారసుడు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ పెద్దలతో ఉత్తమ్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం ఉంది.
ఈ క్రమంలో ఉత్తమ్ ను టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డిని మెప్పించాలని మహేశ్వర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు కూడా గట్టిగా అనుమానిస్తున్నాయి.