ఆరు విడతల పోలింగ్ ముగిసిన తరవాత భిన్నమైన విశ్లేషణలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. అయితే బీజేపీ పరిస్థితి గొప్పగా ఉందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. రెండు ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ సాధించబోయే ఫలితాలను బట్టే ఆ పార్టీ జాతకం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాలు యూపీ, బీహార్. దేశంలోనే అత్యంత పేద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లో పదేళ్లుగా పరిస్థితులు ఏమీ మారలేదు. యోగి సర్కార్ చేస్తున్న ప్రచారానికి.. ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులకు పొంతన లేదు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం సెంటిమెంట్ ఎక్కువగా లేదు. మందిర నిర్మాణాన్ని హిందువుల విజయంగా మార్చాలని చేసిన ప్రయత్నాలు సక్సెస్అవుతున్ నసూచనలు కనిపించడం లేదు. బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కొందరు పార్టీ నాయకులు చేసిన ప్రకటనల వీడియోలు కమలదళాన్ని ఇబ్బంది పెట్టాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వోద్యోగాల్లో తమ రిజర్వేషన్లు పోతాయేమోనని దళితులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పైగా మోడీ సంక్షేమ పథకాలు తమకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో కన్పిస్తోంది.
అయితే బీజేపీ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అనడానికి అవకాశం లేదు. గ్రామీణ కుటుంబాల కోసం నగదు బదిలీ పథకాలు తీసుకురావడం బీజేపీకి ప్లస్ గా మారింది. ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి, వంట గ్యాస్ కొనుగోలు చేయడానికి నగదు బదిలీలు చేశారు. రైతులకు కూడా ఇదే రకంగా సాయం అందించారు. వీటన్నింటికీ ప్రధానమంత్రి యోజన లేదా ప్రధానమంత్రి పథకాలు అనే పేరు పెట్టారు. కోవిడ్ సమయంలో నెలవారీ ఆహార రేషన్‌ను కేంద్రం రెట్టింపు చేసింది. దీనికి కూడా ప్రధానమంత్రి పథకం పేరే పెట్టింది. ఉచిత రేషన్ బీహార్, యూపీల్లో కీలకమైన హామీగా మారింది.
రెండు సార్లు యూపీ, బీహార్లలో బీజేపీకూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి అదే విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఎన్ని సీట్లు కోల్పోతే అంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఎంత తక్కువ చేసుకుంటే బీజేపీ అంతగా గండం నుంచి బయటపడుతుంది.