మనోడు, పగోడు అనే తేడా లేదు. అనుమానం వస్తే చాలు… ఫోన్ ట్యాపింగ్ చేయటం. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో వినటం. ఇలా ఒక్కరివో, ఇద్దరివో కాదు. ఏకంగా 1200మంది ఫోన్లు ట్యాప్ చేశామని డీఎస్పీ ప్రణీత్ రావు స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు.
జడ్జీల నుండి జర్నలిస్టుల వరకు, ప్రతిపక్ష నేతల నుండి సొంత పార్టీ లీడర్ల వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేశామని… ముఖ్యంగా ఎన్నికల ముందు ప్రతిపక్షాల నేతలకు డబ్బులు సరఫరా కాకుండా అడ్డుకున్నామని ప్రణీత్ రావు అంగీకరించారు. వాటిని హవాలా మనీ అని రికార్డులో చూపించామన్నారు.
ఐజీ ప్రభాకర్ రావు సూచనల మేరకే ఇదంతా చేశామని… 56మంది పోలీసులు, 17కంప్యూర్లతో పాటు ట్యాపింగ్ పరికరాలు వాడినట్లు ఒప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని తెలిశాక, ప్రభాకర్ రావు రాజీనామా చేసే ముందు హార్డ్ డిస్కులు ద్వంసం చేయాలని చెప్పటంతో వాటి ప్లేసులో కొత్తవి పెట్టి, పాత వాటిని ద్వంసం చేసి మూసీలో విసిరేసినట్లు తెలిపారు.
ఐజీ ప్రభాకర్ రావు సూచనల మేరకు నాలుగు అధికారిక ఫోన్లు, మూడు అనధికారిక ఫోన్లు వాడినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు.
ఇప్పటికే ఇదే కేసులో పెద్దాయన చెప్పినందుకే ఇదంతా చేశామని మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు చెప్పగా, ఇప్పుడు ప్రణీత్ రావు వాంగ్మూలం అందుకు బలం చేకూర్చినట్లు అయ్యింది.
అయితే, ఈ ట్యాపింగ్ అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని… దీనిపై కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ నేతలు సైతం వ్యాఖ్యానిస్తుండగా, కేసీఆర్ పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది.