‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ చూసి అంతా షాక్ తిన్నారు. ఇంటిన్సిటీ మాట పక్కన పెడితే, అందులో కొన్ని బూతులు యదేచ్ఛగా వదిలేశారు. ట్రైలర్లోనే ఇన్ని ఉంటే, ఇక సినిమాలో ఉన్ని ఉంటాయో అనే భయం అందరిలోనూ పట్టుకొంది. యూత్ మాట సరే, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారా, రారా అనే భయాలు నెలకొన్నాయి. అయితే… ఈ బూతులు ట్రైలర్ వరకే, సినిమాలో ఉండవు. సెన్సార్ వాటిపై బీప్ వేసేసింది. ఇక ఫ్యామిలీ కూడా నిరభ్యంతరంగా ఈ సినిమా చూడొచ్చు. ఇదే విషయంపై దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ”ట్రైలర్లో కొన్ని బూతులు వినిపించాయి. అవి సినిమాలో ఉండవు. ట్రైలర్ కు సెన్సార్ కట్ లేదు కాబట్టి, అలానే వదిలేశాం. సినిమాకు సెన్సార్ ఉంటుంది కదా. అందుకే అవి వినిపించవు” అని క్లారిటీ ఇచ్చారు.
టైటిల్ చూసి ఇదో గ్యాంగ్ స్టర్ సినిమా అని అందరూ అనుకొంటున్నారని, అయితే ఇది ఆ తరహా కథ కాదని, గోదావరి తీరంలో రాజకీయ నేపథ్యంలో సాగే కథ అని వివరించారు. గోదావరి జిల్లాలంటే పచ్చదనం, ఆప్యాయతలే చూపిస్తారని, అక్కడ కూడా రాజకీయాలు, కుట్రలు ఉంటాయని, ఆ ఆలోచనతోనే ఈ సినిమా తెరకెక్కించానని, ఇదంతా కల్పిత కథే అని వివరించారు. మహాభారతంలో ‘నా అనేవాడే నీ మొదటి శత్రువు’ అనే మాట తనకు చాలా ఇష్టమని ఆ వాక్యం తనని చాలా ప్రభావితం చేసిందని `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` కథ రాసుకోవడానికి ఆ వాక్యం చాలా స్ఫూర్తి ఇచ్చిందని చెప్పుకొచ్చారు కృష్ణ చైతన్య. పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని, తనతో సినిమా చేయాలని ఉందని, అదెప్పుడు నెరవేరుతుందో తెలీదని ముక్తాయించారు. విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈనెల 31న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.