సినిమా రిజల్ట్ ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎంత కష్టపడినా ప్రేక్షకుల తీర్పు ఫైనల్. కంటెంట్ చేతిలో లేకపోయినా, ఫుటేజ్ అయినా చేతుల్లోనే ఉంటుంది కదా. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థకు ఉంటుంది కదా? కానీ ఫుటేజ్ విషయంలోనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే..? ‘భజే వాయు వేగం’ సినిమా విషయంలో ఇదే జరిగింది.
కార్తికేయ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ లో రూపొందిన సినిమా ఇది. ఈనెల 31న విడుదల కానుంది. నిజానికి లాక్ డౌన్ తరవాత మొదలైన ప్రాజెక్ట్ ఇది. యేడాది క్రిందటే విడుదల కావాలి. కానీ ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి అసలు కారణం.. ఫుటేజీ మిస్ అవ్వడం అని తేలింది. ఎడిటింగ్ వెర్షన్ ఫుటేజ్ సడన్‌గా కనిపించకుండా పోయిందట. ఆ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడంతో, మళ్లీ రా మెటీరియల్ తీసుకొచ్చి, రీ ఎడిట్ చేయాల్సివచ్చింది. దాంతో మూడు నెలల పాటు సమయం వృధా అయినట్టు టాక్. అయితే ఈ విషయాన్ని హీరోకి కూడా చెప్పలేదట. నిన్నా మొన్నటి వరకూ హీరో దగ్గర కూడా ఫుటేజీ మిస్ అయిన విషయాన్ని గోప్యంగా ఉంచారట. ‘రా’ మెటీరియల్ అలానే ఉంది కాబట్టి సరిపోయింది. పూర్తిగా ఫుటేజీనే మిస్ అయితే… ఏమైపోయేదో..?
మొత్తానికి ‘భజే వాయువేగం’ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 31న వచ్చేస్తోంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. కథలోని స్పీడ్ ప్రచార చిత్రాల్లో కనిపిస్తోంది. రన్ టైమ్ కూడా చాలా షార్ప్‌గా కట్ చేశార్ట. 2 గంటల 16 నిమిషాల్లోనే సినిమా అయిపోతుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాకు రన్ టైమ్ చాలా ముఖ్యం. అనవసరమైన సాగదీతలు లేకుండా బాగానే ఎడిట్ చేసినట్టే.