కౌంటింగ్లో వైసీపీ గందరగోళం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నదన్న పక్కా సమాచారం ఉండటంతో.. కౌంటర్ వ్యూహం అమలు చేసేందుకు టీడీపీ రెడీ అయింది. ఇప్పటికే పార్టీ నేతలకు, కౌంటింగ్ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. సాంకేతిక అంశాలపై నిపుణులతో క్లాసులు ఇప్పించారు. అయితే వైసీపీ ఆగడాలనురాజకీయంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా ప్రత్యేక వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. గురువారం సాయంత్రం చంద్రబాబు అమరావతి వెళ్తున్నారు. శుక్రవారం పవన్ కల్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ వారు పలు అంశాలపై చర్చిస్తారు.
విదేశీ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తిరుపతి, తాడిపత్రి, పల్నాడు జిల్లాల్లో చోటు చేసుకున్న ఘర్షణల విషయంలో జరిగిన పరిణామాలపైనా నేతలిద్దరూ చర్చించే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరితో సమావేశంలో బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.