ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలాంటి నిర్ణయాలు ఉండవు. రూల్స్ ప్రకారం… ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రోజు వారీ కార్యకాలాపాలు మాత్రమే జరుగుతుంటాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పాడ్డాక లేదంటే కోడ్ ముగిశాక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరీ అత్యవసరం అయితే ఈసీ అనుమతి కోరి, ఓకే అన్నాక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ, ఏపీలో పాలన తీరే సెపరేటు కదా. ఈసీ అనుమతి లేకుండా, ముందుగా నిర్ణయించకున్నా, టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం అయిపోవటం ఉద్యోగ సంఘాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అసెంబ్లీ గడువు ముగిసి ఎన్నికలు జరగ్గా, ఫలితాలు మరి కొన్ని రోజుల్లో రాబోతుండగా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు విరుద్దంగా అధికారులే బదిలీలకు రంగం సిద్ధం చేయటం అనేక విమర్శలకు తావిస్తుంది. దీని వెనుక ఉన్నవారు ఎవరు…? విద్యాశాఖను శాసించేది ఎవరు…? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ బదిలీలపై ఏపీ ఉద్యోగుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కొంతమంది కావాలని చేస్తున్నారని… కొత్త ప్రభుత్వం వచ్చే వరకు బదిలీలు నిలిపివేయటంతో పాటు బదిలీలు చేపట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ను ధిక్కరించిన అధికారులపై కఠిన శిక్ష తీసుకోవటంతో పాటు బదిలీల ప్రక్రియ నిలిపి వేసేలా ఆదేశించాలని కోరారు.