తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కు లీకువీరుల బెడద తప్పడం లేదు. ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించిన వెంటనే ప్రభుత్వం చర్చించిన సమాచారం గత ప్రభుత్వ పెద్దలకు తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్.. ఏయే శాఖలకు చెందిన అధికారులు గత ప్రభుత్వ పెద్దలతో టచ్ లో ఉన్నారో గుర్తించాలని ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రివ్యూ నిర్వహించి సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయాలు బీఆర్ఎస్ పెద్దలకు క్షణాల్లో తెలియడంపై రేవంత్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే లీకువీరులను బదిలీ చేయాలని ఫిక్స్ అయ్యారు.
లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలోనే వడ్లకు 500బోనస్ ప్రకటించాలని రేవంత్ అధికారులతో ప్రత్యేకంగా ఓ మీటింగ్ నిర్వహించారు. అందులో ప్రతి ఏటా దిగుబడి అవుతున్న వరి ఎంత..? దొడ్డు రకం వడ్లు ఎన్ని..? సన్న వడ్లు ఎన్ని..? అడిగి తెలుసుకొని అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై భారం పడుతుందని గుర్తించారు. దాంతో తగ్గుతున్న సన్న వడ్లకు ప్రోత్సాహం అందించేందుకు సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇంకేముంది వెంటనే బీఆర్ఎస్ లీడర్లకు ఈ విషయం తెలిసిపోయింది. దొడ్డు వడ్లకే సర్కార్ బోనస్ ఇస్తుందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో అధికారులతో చర్చించిన విషయం బయటకు ఎలా పొక్కింది..? బీఆర్ఎస్ లీడర్లకు ఎలా తెలిసిందని ఆరా తీసిన రేవంత్ ఓ ముగ్గురు ఐఏఎస్ అధికారులే ఈ విషయాన్ని బీఆర్ఎస్ లీడర్లకు చేరవేశారని గుర్తించినట్లుగా తెలుస్తోంది. .
సదరు అధికారుల్లో ఇద్దరు స్పెషల్ సీఎస్ హోదాలో ఉండగా..మరొకరు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పని చేస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వారిపై బదిలీల వేటు వేయాలని రేవంత్ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది.