వైసీపీని నవ్వుల పాలు చేసేందుకు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగమే సరంజామా రెడీ చేస్తోందా..? ఈ విషయాన్ని గ్రహించే అతిని తగ్గించేయాలని సోషల్ మీడియా వింగ్ కు ఆ పార్టీ నేతలు సలహా ఇచ్చారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ఏపీలో జగన్ 2.0 అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న వైసీపీ సోషల్ మీడియా వింగ్.. ఫలితాలు వెలువడక ముందే విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకార మహోత్సవ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెగ హడావిడి చేస్తోంది. వైసీపీ ఓవరాక్షన్ పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టించినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఓ వైపు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అంతా పోలింగ్ అనంతరం మొదట్లో తోక జాడించి తర్వాత ఓటమి ఖాయమని సైలెంట్ అవుతుంటే… సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం మాత్రం ఆ పార్టీని అభాసుపాలు చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదని పోలింగ్ ట్రెండ్స్ స్పష్టం చేశాయి. అయినా సోషల్ మీడియా విభాగం మాత్రం వైసీపీదే విజయమని అతిగా ప్రచారం చేసుకుంటుంది. వారి అంచనాలే నిజమై వైసీపీ అధికారంలోకి వస్తే సరేసరి, కూటమి అధికారంలోకి వస్తే మాత్రం వైసీపీ అభాసుపాలు అవ్వడం ఖాయం. వైసీపీ సోషల్ మీడియా ఇటీవలి ప్రచారం ముందుంచి ఆ పార్టీ వ్యతిరేకులు వైసీపీని హేళన చేసే అవకాశం ఉంది . ఇది వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఏమాత్రం ఇబ్బందికరం కాదు. ఎటొచ్చి ఈ ట్రోలింగ్ ముళ్ళు ఆ పార్టీ నేతలకే గుచ్చుకోనుంది. అందుకే భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని అతిని తగ్గించేయాలని వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఆ పార్టీ నేతలు సలహా ఇచ్చారని తాజాగా ప్రచారం జరుగుతోంది.