ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటూ ఇప్పటికే జాతీయ స్థాయి సెఫాలిజిస్టులు.. రాష్ట్ర స్థాయి సర్వేల నిపుణులు తేల్చారు. అయితే వైసీపీ మాత్రం మీ అందరి అంచనాలను తలకిందులు చేస్తామని గెలుపు మాదేనని అంటోంది. ఆ పార్టీ నేతలు ఎవరూ బహిరంగంగా విశ్లేషణ చేయకపోయినా.. వారి సూచనల మేరకు నీలి, కూలి మీడియాల్లో చర్చలు పెట్టి లెక్కలు తేల్చేస్తున్నారు. ఆ ప్రకారం వారు చెప్పే మాట.. సంక్షేమం అందిన ప్రతి ఒక్క లబ్దిదారు వైసీపీకే ఓటేస్తారు.
సంక్షేమం పేరుతో వైసీపీ ఐదేళ్లలో నికరంగా ఖాతాల్లో వేసిన సొమ్ము లబ్దిదారులకు సగటున పాతిక వేలకు మించదు. పిల్లలున్న వారికి అమ్మఒడి మాత్రమే నికరంగా అంతో ఇంతో అమలైన పథకం. రైతు భ రోసా సహా ఏదీ సరిగ్గా అమలు లేదు. ఇతర నగదు బదిలీ పథకాల లబ్దిదారులు నియోజకవర్గంలో వెయ్యి మంది కూడా ఉండరు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం పెద్ద ఫెయిల్యూర్. నాలుగు విడతలు ఎగ్గొట్టడంతో లబ్దిదారులు రగిలిపోతున్నారు. గత ఆరు నెలలుగా ఒక్క పథకానికీ డబ్బులు ఇవ్వలేదు. బటన్లు నొక్కి వదిలేశారన్న కోపం ఉంది.
అయితే ఈ లబ్దిదారుల్లోనే ప్రభుత్వ బాధితులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ లబ్దిదారుల కుటుంబాల్లోని వారే మద్యాన్ని కొంటారు ?. గతంలో మద్యం ఎంతకు కొంటాం… జగన్ రెడ్డి వచ్చాక ఎంతకు కొంటున్నారో వారికి తెలియదా ?. నిత్యావసర వస్తువుల ధరల గురించి తెలియదా ? తమ ఉపాధిని దెబ్బతీశారని తెలియదా ?. నిజం చెప్పాలంటే… తాము ఎవర్ని అయితే ఓటు బ్యాంక్ అనుకుంటామో వారినే దోచుకున్నాడు జగన్ రెడ్డి. ఆ పేదలకు ఆ నొప్పి తెలియదా ?. దోచుకున్న దాంట్లో కొంత ఇస్తే ఓట్లు వేసేస్తారా ?