తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి నష్టనివారణ చర్యలు చేపట్టారు. రాష్ట్ర చిహ్నం, గీతాలపై మార్పులు, చేర్పులకు గల కారణాలను వివరించాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు సచివాలయంలో గురువారం సాయంత్రం 4గంటలకు పలు రాజకీయ పార్టీలతో రేవంత్ భేటీ కానున్నారు. ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం స్ఫూరించేలా కొత్త చిహ్నం రూపొందించామని… ఎవరినో కించపర్చడానికి మార్పులు చేపట్టలేదని వివరించనున్నారు.
రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ సమావేశానికి బీఆర్ఎస్ హాజరు అవుతుందా.. లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే, ఈ సమావేశానికి బీఆర్ఎస్ డుమ్మా కొట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. రాష్ర చిహ్నంలో మార్పులు చేశాక, ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఈ సమావేశం నిర్వహిస్తారా..? అని బీఆర్ఎస్ ఈ మీటింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించి ఉండాల్సింది. తీరిగ్గా చిహ్నంకు ఆమోదముద్ర వేశాక సమావేశం నిర్వహిస్తూ ఉండటాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టె అవకాశం ఉంది. రేవంత్ ఆలోచన ఎలా ఉన్నా, ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం అవుతుండటంతో దానిని కప్పి పుచ్చుకునేందుకే ఈ భేటీ నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించే ఛాన్స్ ఉంది. ఇక, వామపక్షాలు ఎలాగు కాంగ్రెస్ కు మద్దతుగానే ఉండటంతో ప్రభుత్వ నిర్ణయానికి జై కొట్టనున్నారు. కానీ ఈ విషయంలో బీజేపీ తన వైఖరిని ఇంకా స్పష్టం చేయకపోవడంతో సమావేశానికీ బీజేపీ వెళ్తుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.