ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో బాగా తెలుసు. నేరుగా బహిరంగసభల్లో పాల్గొనడం మాత్రమే ప్రచారం కాదు. తన ప్రతి పని ప్రచారంగా మార్చుకోవడం ఆయన స్టైల్. గతంలో ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్ వంటి చోట్ల ధ్యానం చేసి రోజంతా వార్తల్లో నిలిచారు. ఇది కూడా ప్రచారమేనని గగ్గోలు పెట్టినా ఈసీ పట్టించుకోలేదు. ఈ సారి కూడా అదే చేస్తున్నారు.
ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే… ప్రధాని తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. అక్కడే ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారిలో స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం సాయంత్రం నుంచి 45 గంటలపాటు ధ్యానం చేయనున్నారు. నలభై ఐదు గంటలంటే చిన్న విషయం కాదు. మీడియా ఊరుకుంటుందా ? ప్రచారం చేయకుండా ఉంటుందా ?
ఇదే విషయాన్ని ఇండియా కూటమి నేతలు సీరియస్ గాతీసుకున్నారు. మోడీ చేపట్టనున్న ధ్యానాన్ని టివిలలో ప్రసారం చేస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్నారు. ధ్యానం చేస్తుంటే ఎవరైనా కెమెరాలు తీసుకువెళతారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ రోజుకు, ప్రచారం ముగింపునకు మధ్య విరామ సమయంలో ప్రచారం చేసేందుకు ఇదో మార్గమని వారు మండి పడుతున్నారు. కానీ ధ్యానం ప్రచారం ఎలా అవుతుందని ఆయనకు కావాల్సినంత ప్రచారం ఇచ్చేందుకు మీడియా రెడీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.