తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడంతో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయిన ప్రభుత్వం చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రాష్ట్ర గీతం, నూతన అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఆ దిశగా కసరత్తు ప్రారంభించగా, చిహ్నం మార్పు విషయంలో బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాకతీయ కళా తోరణం, చార్మినార్ లను అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తే ఊరుకోబోమని నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఈ విషయంలో మొండి పట్టుదలకు పోవద్దని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాకే రాష్ట్ర అధికారిక చిహ్నం ఫైనల్ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కేవలం తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరించనుంది ప్రభుత్వం. ఈ రాష్ట్ర గేయం విషయంలో ఏపీకి చెందిన కీరవాణితో స్వరకల్పన చేయడంపై మాత్రమే బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో పెద్దగా వ్యతిరేకత లేదని భావించిన ప్రభుత్వం జూన్ 2న కేవలం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.