తెలంగాణ అధికారిక చిహ్నం మార్పును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా బీజేపీ ఎలాంటి వైఖరిని ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతుంటే బీజేపీ మాత్రం మౌనం వీడకపోవడం ఏంటి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ చేసిన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
రాష్ట్ర చిహ్నం మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్…ప్రస్తుత ఎంబ్లమ్ లో నుంచి చార్మినార్ ను తొలగించవద్దన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు చార్మినార్ అంటున్నాడని, కానీ అది అతనికి మాత్రమే వర్తిస్తుందనిపేర్కొన్నారు. వాస్తవానికి హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అని , అదే విధంగా ప్రసిద్ధి చెందిందన్నారు బండి. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అంటే రాష్ట్ర అధికారిక చిహ్నంలో చార్మినార్ కు బదులుగా భాగ్యలక్ష్మి దేవాలయాన్ని పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారా…? అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. విషయం ఏదైనా అందులోకి మతం జొప్పించడం బండి సంజయ్ నైజమని మరోసారి బయటపెట్టుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.