తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోన్న సోషల్ మీడియా సంస్థలను కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయద్దమే పనిగా పెట్టుకున్న సోషల్ మీడియా సంస్థలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని రేవంత్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రేవంత్… సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న తప్పుడు కథనాలను అడ్డుకునేందుకు ఏం చేయాలన్న దానిపై లీగల్ నిపుణులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వివిధ శాఖల్లో జరుగుతోన్న కార్యక్రమాలపై విపక్షాలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో ఈ కథనాలను కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై రేవంత్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.
అయితే, కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ నిత్యం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ఎజెండాగా పెట్టుకున్నాయని నిఘా వర్గాలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లగా … ఆధారాలు లేకుండా పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోన్న ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని, హద్దులు మీరితే కేసులు నమోదు చేయాలని రేవంత్ ఆదేశించినట్టుగా సమాచారం.