ప్రజాస్వామ్యంలో గెలిచేవారు ఎవరూ ఉండరు.. గెలిచేది ప్రజలు. వారు ఎవర్ని ఎన్నుకుంటే వారి ప్రతినిధులే అధికారంలో ఉంటారు. తమ ప్రతినిధుల్ని మార్చాలనుకున్నప్పుడు ప్రజలు మార్చేస్తారు. కానీ రాజకీయ పార్టీలు తామే గెలుస్తామన్న భ్రమల్లో ఉంటాయి. తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు తమను ఆ పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలతోనే గేమ్స్ ఆడతాయి. కానీ ప్రజల ముందు ఏ గేమ్స్ అయినా చెల్లవని చరిత్ర నిరూపించింది. ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మహిళకే ప్రజలు తమ సత్తా చూపారు. అప్పట్లో ఇంతగా మీడియా, సోషల్ మీడియా లేదు. అయినా చైతన్యానికి కొదవలేదు. ఇప్పటికీ ఆ చైతన్యం ప్రజల్లో ఉంది.. ఎప్పపటికీ ఏకపక్ష మీడియాలు.. పేక్ సోషల్ మీడియాలు కలుషితం చేయవచ్చేమో కానీ.. ప్రజాతీర్పు మాత్రం ఎప్పుడూ తెలివిగానే ఉంటుంది.
చివరి దశకు సార్వత్రిక ఎన్నికల సమరం
దేశం ఇప్పుడు అత్యంత సుదీర్ఘమైన సార్వత్రిక ఎన్నిక సమరంలో చివరి దశకు వచ్చింది. నాలుగో తేదీన ఫలితాలు వస్తాయి. ఎవరు గెలుస్తారన్నదానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. ఏకపక్ష ఎన్నికలు మాత్రం జరగడం లేదు. బలహీనం అనుకున్న కూటమి.. గట్టి పోటీ ఇస్తున్నామన్న నమ్మకం తో ఉంది. పదేళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ మొదట్లో చూపించినంత కాన్ఫిడెన్స్ తర్వాత తర్వాత చూపించలేకపోయింది. అది వారి వ్యూహమా.. నిజంగానే ఆందోళన చెందుతున్నారా అన్నది వారికే తెలియాలి. ఎందుకంటే.. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా రాజకీయాలను చూసిన వారికి వారి అంత సామాన్యంగా తల వంచుతారని ఎవరూ అనుకోరు. సార్వత్రిక ఎన్నికల సమరం మొదట ఏకపక్షంగా ప్రారంభమయింది. 400 సీట్లు తమ ఎన్డీఏ కూటమి సొంతం అవుతాయని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ధీమా అయిన ప్రకటనలతో పరుగులు ప్రారంభించారు. మూడు నెలల కిందట ఉన్న పరిస్థితులు, ప్రతిపక్ష నేతల అరెస్టులు , ఇండియా కూటమి అనైక్యత, కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు అయినా సాధిస్తుందా లేదా అన్న సందేహాల నడుమ బీజేపీ గెలుపుపై ఎవరూ చర్చలు జరపలేదు. ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు సాధిస్తుందా లేదా అన్నదానిపైనే మాట్లాడటం ప్రారంభించారు. అంటే.. కేంద్రంలో రాబోయేది మరోసారి మోడీనే అని అందరూ ఫిక్సయ్యారు. ఎదుకంటే అప్పటికే దేశంలోని మీడియా సంస్థలన్నీ తమ ముందస్తు సర్వేల్లో వచ్చేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనేనని ప్రజల మెదళ్లలో చేర్చేశాయి. కానీ అసలు ఎన్నికల సమయం ప్రారంభమైన తర్వాత రాజకీయం కీలక మలుపులు తిరగడం ప్రారంభించింది. మొదటి రెండు విడతల తర్వాత అనూహ్యంగా బీజేపీ అనుకున్నంతగా జోరు చూపించడం లేదన్న విశ్లేషణలు రావడం ప్రారంభించాయి. చివరి విడతకు వచ్చే సరికి ఇండియా కూటమికి మెజార్టీ రావొచ్చని కూడా జోస్యం చెప్పేవాళ్లు పెరిగిపోయారు. అయితే ఇది సోషల్ మీడియాలోనే. నిజమైన పరిస్థితి ఏమిటో తెలియదు. బీజేపీ వెనుకబడిందని విశ్లేషిస్తున్న వారు గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి.. ఈ సారి సీట్లు కోల్పోయే రాష్ట్రాలను చూపిస్తున్నారు. యూపీలో ఈ సారి కాంగ్రెస్, సమాజ్ వాదీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభావం శూన్యానికి మారిపోయి చాలా కాలం అయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ కూడా ఓడిపోయారు. ఈ సారి బీజేపీ, యోగి సర్కార్ పై వ్యతిరేకతతో బీజేపీ గతం కన్నా సీట్లు కోల్పోతుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఉద్దృతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్లలో బీజేపీ చేసిన ప్రభుత్వాల మార్పు రాజకీయాల కారణంగా బీజేపీనే ఎక్కువగా నష్టపోతుందని లెక్క గడుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకల్లో గతంలో క్లీన్ స్వీప్ చేశారని.. ఈ సారి సగం సీట్లు కోల్పోతారని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. గుజరాత్ లోనూ కొన్ని సీట్లు బీజేపీ కోల్పోతుందని లెక్కలేస్తున్నారు. నిజంగా పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు.
బీజేపీకి ఎదురుగాలి 2019లో ఇంత కంటే ఎక్కువే – కానీ ఏం జరిగింది ?
బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని నమ్మకం కలిగించేలా చేస్తున్నారు కానీ.. 2019 ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యతిరేక ప్రచారం ఇంకా ఉద్ధృతంగా సాగింది. ఎంతగా అంటే… 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని పెట్టి ఆయనను అభివృద్ధి ప్రదాతగా ప్రచారం చేయడంతో హింద రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసిందని.. ఐదేళ్ల ఆయన పాలనలో దేశం నాకిపోయిందని గుర్తించారని ఓట్లు ఎవరూ వేయరని అనుకున్నారు. ఎంతగా అంటే.. ప్రాంతీయ పార్టీలన్నీ గతంలో ఎన్నడూ లేనంతగా జట్టు కట్టాయి. మరోసారి సంకీర్ణ కూటమి సర్కార్ రావడం ఖాయమనుకున్నారు. దీన్నే బలంగా నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విపక్ష కూటమితో కలిశారు. చివరికి కాంగ్రెస్ తోనూ చేతులు కలిపారు. కానీ బీజేపీని ఎంత తక్కువగా అంచనా వేశారో ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కాంగ్రె్స పార్టీ అధికారికంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందే సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. అది వరుసగా రెండోసారి. ఇక టీడీపీ లాంటి పార్టీలు పాతాళానికి కూరుకుపోయాయి. అతి కష్టం మీద మళ్లి పుంజుకుంది.. చివరికి మళ్లీ బీజేపీ గూటికే చేరింది. 2019 ఎన్నికల పరిస్థితులు చూసిన వారికి.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని అనుకోవచ్చు. అప్పట్లాగా బీభత్సమైన వ్యతిరేక ప్రచారం జరగడం లేదు. కేంద్ర ప్రబుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. మార్చేయాల్సిందేనన్న పట్దుదలతో ప్రజలు ఉన్నారని ఎవరూ చెప్పడం లేదు. అలాగని సానుకూలత కూడా ఉందని చెప్పలేని పరిస్థితి.
మోదీ మార్క్ రాజకీయాన్ని అర్థం చేసుకోని రాజకీయ పండితులు
ప్రధాని మోదీ తమ పరమైన ప్రసంగాలతో ఎన్నికల ప్రచారం చేయడంతో ఎక్కువ మంది బీజేపీ వెనుకబడిందని అందుకే మళ్లీ మత వాదం అందుకున్నారని విశ్లేషించడం ప్రారంభించారు. నిజానికి మోదీ చేసే రాజకీయానికి.. ఇతరులు చేసే రాజకీయానికి అదే తేడా. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మోదీకి తెలిసినంతగా ఇతర రాజకీయ నేతలకు తెలియదు. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. యూపీకి వెళ్లి ఉచిత రేషన్ గురించి గొప్పగా చెబుతారు. అదే సమయంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని మాత్రం ఆపరు. ఆయన చెప్పే ఆ మాటలే హైలెట్ అవుతాయి. మోదీకి కావాల్సింది కూడా అదే. ప్రజల ఎమోషన్ ను ఓట్లుగా మల్చుకోవడంలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఓ సారి ఇంటర్యూలో మేఘాల్లో దాక్కుని యుద్ధ విమానాలు వెళ్లి పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేశాయని చెప్పారు.. దాన్ని అందరూ ట్రోల్ చేశారు. కానీ మోదీ టార్గెటెడ్‌గా ఆ వ్యాఖ్యలు చేశారు. చేతుల్లో ఫోన్లు ఉండి.. ఏమీ తెలియని గ్రామీణ ప్రాంత అమాయకుల్ని ఆయన అలా ఆకట్టుకున్నారని తర్వాత ఫలితాల్లో తేలింది. తాజాగా ఓ ఇంటర్యూలో గాంధీపై సినిమా వచ్చే వరకూ ఆయన గురించి ఎవరికీ తెలియదని చెప్పారు. మోదీని ట్రోల్ చేస్తున్నారు.. కానీ ఆయన కొత్తగా ఓట్లు పొందిన వారిని టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.. చేతిలో పోన్లు ఉండే వారిని టార్గ్గెట్ చేశారని అనుకోవచ్చు. ఇలాంటివి ఆయన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయరు. తనను ట్రోల్ చేసినా… తనకు ఎలాంటి ప్రచారం కావాలో ఆయనకు తెలుసు. అందుకే ఆయన అసాధ్యమైన నేతగా ఎదిగారు. ఆయన రాజకీయాన్ని పట్టుకోవడం ఇతర నేతల వల్ల కావడం లేదు.
60 శాతానికిపైగా వ్యతిరేకంగా ఓటేస్తున్నా ప్రధానిగా మోదీ
అయితే మోదీని ఓడించడం అసాధ్యమా అంటే.. ప్రజాస్వామ్యంలో అదీ అసాధ్యం కాదని చెప్పుకోవచ్చు. తమకు ఈ ప్రభుత్వం వద్దని వారు అనుకుంటే.. ఎంతటి బలమైన నేత అయినా.. ఎన్ని విన్యాసాలు చేసినా వద్దనుకుంటారు. ఎదుకంటే.. ఓటు అనే నిర్ణయాత్మక శక్తి ప్రజల్లోనే ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వం వద్దని ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకుందామని ప్రజల్ని విప్కషాలు నమ్మించగలిగితే మార్పు వస్తుంది. అలాంటి పరిస్థితి ఉందా లేదా అన్నదే కీలకం. మోదీకి ఎంత బలమైన సపోర్టు ఉందో.. అంత వ్యతిరేక వర్గం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనను సమర్థించేవారి కంటే వ్యతిరేకించేవారే ఎక్కువ ఉన్నారు. ఈ విషయాన్ని గణాంకాలు నిరూపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 37 మాత్రమే. అంటే.. 63 శాతం మంది బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ మోదీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. ఎందుకంటే మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. వంద మందిలో ఐదుగురు పోటీ పడితే.. ఒకరికి ఇరవై ఒకటి.. ముగ్గురికి ఇరవై.. ఒకరికి పందొమ్మిది ఓట్లు వస్తే.. ఇరవై ఒక్కటి వచ్చిన వాడే విజేత. అతనికి వ్యతిరేకంగా 79 మంది ఓటేశారంటే.. అది వ్యాలిడ్ కాదు. ఆ 79 మందిపై ఆ 21 ఓట్లు వచ్చిన వ్యక్తి పాలన చేస్తాడు.. పెత్తనం చేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ పోటీ చేస్తుంది కానీ.. ప్రత్యర్థిగా కాంగ్రెస్ లేదు. ఇతర పార్టీలు ఉన్నాయి. అలా ఓట్లు చీలిపోతున్నాయి. ఈ సారి కూడా .. బీజేపీ నలభై శాతం ఓట్లు తెచ్చుకుంటుందని ఎవరూ చెప్పడం లేదు. కానీ బీజేపీ కూటమి నాలుగు వందల సీట్లు సాధిస్తే.. యాభై కి పైగా ప్రజల మద్దతు పొందినట్లు కాదు. వారి ఓట్లు నలభై శాతానికిలోపే ఉంటాయి. అరవై శాతం మంది వారిని వ్యతిరేకించినట్లే.
ప్రభుత్వాలను మారుస్తూ ఉంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ !
ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ అధికారం ప్రతీ సారి ఒకరికే కట్టబెట్టడం ప్రమాదకరం. ఒక్క సారి అధికారం పొందిన వారు ఇక తామే శాశ్వతంగా ఉండాలనుకుంటారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మార్పిి చేస్తూ ఉంటేనే వారు జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే మోనార్కిజం వస్తంది. ప్రస్తుతం బీజేపీ మరోసారి గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని చెప్పుకుంటున్నారు.. రాజ్యాంగం మార్చేస్తారని అంటున్నారు. ఇలా చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఆ పార్టీ చెప్పుకుంటున్నట్లుగా చేతిలో నాలుగు వందల సీట్లు ఉంటే.. ఏమి చేయడానికైనా అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు మార్పుకు ఓటేస్తే దేశానికి ప్రయోజనం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ మార్పు అనేది ఒక్క దేశానికే కాదు.. అన్ని చోట్లా రాష్ట్రాలకూ వర్తిస్తుంది. రాష్ట్రాల్లో మోనార్కిజం అలవాటు చేసుకున్న పాలకులు.. ప్రజలు కట్టిన పన్నులు లేదా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి పదో పరకో భిక్షం తరహాలో వేసి.. ఓటు బ్యాంకుగా మార్చుకుని తామే పాలన చేస్తామన్న రీతిలో ఉన్నారు. అలాంటి వారికి ప్రజలు ఓట్లతో మార్పు గురించి చెప్పాల్సి ఉంటుంది. అందుకే మార్పు మంచికే అనేది. మరి ప్రజలు ఏం ఆలోచించారో నాలుగో తేదీన తెలుస్తుంది.