విశాఖలో ఓ మహిళ తన భర్త వేరే ఆమెతో సంసారం చేస్తున్నాడని మీడియా గొట్టాల్ని తీసుకెళ్లి రచ్చ చేశారు. వేరే మహిళతో ఉండగా భర్తను పట్టుకున్న భార్య అని టీవీల్లో బ్రేకింగ్‌లు వేశారు. నిజానికి అది కార్యాలయం. ఆ ఆఫీసులో ఇద్దరు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా పని చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీవీ గొట్టాల ముందు చెప్పారు కూడా. అయితే వారి మాటల్ని పట్టించుకోలేదు.. మరో మహిళతో పట్టుబడ్డ భర్త అని వేస్తే వచ్చే మసాలా ఘాటు వేరు కాబట్టి దానికే ఫిక్సయ్యారు.
మసాలా ఉండేలా గొట్టాల ప్రతినిధులే ట్రైనింగ్ ఇచ్చారా ?
వైజాగ్ ఎపిసోడ్లో మహిళ తన భర్తతో విడిపోయి నాలుగేళ్లు అవుతోంది. మరోసారి భర్తతో కలిసే అవకాశమే లేదు. దానికి ఆమె మీడియాను తీసుకెళ్లి చేసిన రచ్చే సాక్ష్యం. ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది. భర్తను కొట్టింది కూడా. ఇలాంటి ప్రవర్తన వల్ల మీడియాలో ఫోకస్ వస్తుందని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లుగా ఆమె వ్యవహరించినట్లుగా అర్థమవుతుంది. బహుశా గతంలో శ్రీరెడ్డిని బట్టలిప్పదీసుకోమని సలహా ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా అలా భర్తపై చేయి చేసుకుంటే ఎక్కువ ప్రచారం జరుగుతుందని .. మసాలా ఉంటుందని ఆ గొట్టాల ప్రతినిధులు సలహా ఇచ్చారేమో వారికే తెలియాలి.
ఆ మగాడి బాధ చూడకుండా తీర్పు ఇచ్చేయడమేంటి ?
టీవీ గొట్టాలతో వచ్చే అతి పెద్ద సమస్య అప్పటికప్పుడు తీర్పు చెప్పేయడం. మహిళను మోసం చేశాడని.. పాపం మాజీ మిస్ వైజాగ్ అన్యాయమైపోయిందని రాసుకొచ్చారు. ఆమె తన భర్త లేదా మాజీ భర్త మీద చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేననని తీర్పు చెప్పి మరీ ప్రచారం చేస్తున్నారు కానీ ఆయన మాటల్ని మాత్రం పట్టించుకోలేదు. తనపై తప్పుడు కేసులు పెట్టి వెళ్లిపోయిందని.. విడిపోయి నాలుగేళ్లయిందని.. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆయనంటున్నారు. తాను ఓ సినిమా తీస్తున్నానని డబ్బులు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఇలా చేస్తోందని ఆయనంటున్నారు.
కుటుంబ గొడవల్లోకి మీడియా రావడం నైతికమేనా ?
వారి మధ్య వివాదం ఇప్పటికే కోర్టుల్లో ఉంది. కేసుల్లో ఉంది. వారు అక్కడ చట్టబద్ధంగా పరిష్కరించుకుంటారు. ఇది కుటుంబ వివాదం. ఇందులో మీడియా.. ముఖ్యంగా టీవీ గొట్టాలు చేసేదేంటి ?. ఆడ-మగ మధ్య ఏదో సృష్టించి.. టీఆర్పీలు.. వ్యూస్ పెంచుకోవడమా మీడియా చేయాల్సింది ?. ఒకనాటి నెంబర్ వన్ చానల్ ప్రారంభించిన ఈ రోగం.. ఇప్పుడు అన్ని మీడియా చానళ్లకు అంటుకుంది. అసలు బ్యాలెన్స్ లేకుండా … ఘోరమైన పద్దతుల్లో ముందుకెళ్తోంది. తప్పుడు మగాడిదేనని .. కుటుంబ వివాదాల్లోనూ తేల్చేస్తున్నారు.