మరో నాలుగు రోజుల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు తేలనున్న నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో 14సీట్లు గెలుపొందబోతున్నామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, పోలింగ్ అనంతరం ఓ స్థానాన్ని కుదించి 13 పక్కా అని ప్రకటించారు. మరోవైపు కమలనాథులు పోలింగ్ తర్వాత డబుల్ డిజిట్ ఖాయమని ధీమాగా చెబుతున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుంది..? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లోనూ అదే తరహ ఫలితాలను రాబడుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టడం, మోడీ చరిష్మాతో తెలంగాణలో ఆ పార్టీకి అనుకూలత ఏర్పడిందని పోలింగ్ ముగిసిన తర్వాత విశ్లేషించారు.
బీజేపీ అగ్రనేతలు చెప్పినట్లుగా ఆ పార్టీ డబుల్ డిజిట్ కాకపోయినా 6- 8 సీట్లు గెలుచుకున్నా కాంగ్రెస్ ఓడినట్లే. ఎందుకంటే ఈ ఎన్నికలను తమ పాలనకు రెఫరెండమని ప్రకటించారు రేవంత్ . దాంతో బీజేపీ గణనీయమైన సీట్లను సాధిస్తే అది రేవంత్ పాలనకు మచ్చగా మారడంతోపాటు అధికారంలోకి వచ్చి అతి తొందరగా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్న విపక్షాల విమర్శలకు బలం చేకూరినట్టే.
దీంతో కాంగ్రెస్ శ్రేణులు మరీ ముఖ్యంగా రేవంత్ అండ్ టీం ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, కాంగ్రస్ ఇంటర్నల్ గా చేయించిన సర్వేలో ఆ పార్టీ 10-12సీట్లు సాధిస్తుందని తేలినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు కాని , కాంగ్రెస్ తో సరిసమానంగా బీజేపీ సీట్లు సాధిస్తే ..రేవంత్ సర్కార్ కు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చునని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.