ఏసీబీ అనే ఓ వింగ్ ఉందని, అవినీతిని అరికడుతుందని జనం మర్చిపోతున్న దశ ఒకవైపు. విచ్చలవిడిగా రోజుకు వందలాదిగా పుట్టుకొస్తున్న హోటల్స్ ఇంకోవైపు… వారు ఆడిందే పాట. పాడిందే పాట. సీన్ కట్ చేస్తే…
తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. లంచగొడి అధికారుల భరతం పడుతుంది. ఇన్నాళ్లు ఎక్కడున్నారు అన్న చందంగా దూకుడుగా ఉంది. ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రీ… ఇలా ప్రతి శాఖలో అవినీతి తిమింగళాలు దొరకుతూనే ఉన్నారు. ఏసీబీ అనేది ఒకటుంది… పట్టుకుంటుందేమో అన్న ఆలోచన అధికారుల్లో చాలా రోజుల తర్వాత మొదలైంది. పేరు మోసిన అధికారులతో పాటు చిన్న చిన్న వారిని వరకు ఎవరినీ వదలట్లేదు.
ఇంకోవైపు ఫుడ్ సెఫ్టీ అధికారులు. కొంతకాలంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ తిన్నా ఆసుపత్రికి వెళ్లేందుకు రెడీగా ఉండాల్సిందేనన్నట్లు రెస్టారెంట్ల కిచెన్స్ చూస్తే కనపడుతున్నాయి. పేరుకు పెద్ద రెస్టారెంట్లు అయినా, ఊరు పేరు లేని హోటల్స్ అయినా అంతా ఒకేలా ఉన్నాయి. కుళ్లిపోయిన మాంసం, బూజుపట్టిన ఆహర పదార్థాలు, ముక్కు మూసుకునేంత దుర్వాసన ఉన్న ఫుడ్ తయారీ ప్లేసులు.
అధికారులకు, ఆ వింగ్స్ ను లీడ్ చేసే వారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కనపడుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కు మంచి మార్కులే పడుతున్నాయి. వ్యవస్థపై విసుగెత్తిపోయిన వారంత శభాష్ అంటున్నారు. దీన్ని ఇక్కడితో ఆపకుండా… కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.