Bhaje Vaayu Vegam Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.5/5
-అన్వర్
‘ఆర్ఎక్స్ 100’ తర్వాత కార్తికేయకు మళ్ళీ అలాంటి విజయం దక్కలేదు. జానర్లు మారుస్తూ కథలు చేస్తున్నాడు కానీ మంచి ఫలితాలే అందడం లేదు. ఆ మధ్య వచ్చిన ‘బెదురులంక` ఫర్లేదనిపించింది. కానీ హీరో రేసులో నిలబెట్టే సినిమా అయితే కాలేకపోయింది. ఇప్పుడు ‘భజే వాయువేగం’ అంటూ ఓ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులని పలకరించాడు. ఈ సినిమాపై మొదట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ బయటికి వచ్చాక కొంత ఆసక్తి ఏర్పడింది. ఏదో కంటెంట్ వున్న సినిమాలానే అనిపించింది. మరి ఇందులో వున్న కంటెంట్ ఏమిటి? ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులని అలరించిందా?
వెంకట్( కార్తికేయ) చిన్నప్పుడే తల్లితండ్రులని కోల్పోతాడు. ఒంటరిగా మిగిలిన వెంకట్ ని లక్ష్మయ్య(తనికెళ్ళ భరణి) చేరదీసి తన కొడుకు రాజ్ (రాహుల్ టైసన్)తో పాటు సొంత బిడ్డలానే పెంచుతాడు. వెంకట్ కు క్రికెటర్ కావాలని కల. ఆ కలతో హైదరాబాద్ చేరిన వెంకట్ కు అడుగడుగునా నిరాశే ఎదురౌతుంది. తను మంచి ఆట తీరు కనబరిచినప్పటికీ డబ్బులు కట్టలేక స్థానం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇంతలో లక్షయ్య ఆరోగ్యం క్షీణిస్తుంది. తన జబ్బు నయం కావాలంటే రెండు రోజుల్లో 20 లక్షలు కావాలి. ఆ డబ్బుని సమకూర్చే క్రమంలో క్రికెట్ బెట్టింగ్ వేస్తాడు వెంకట్. బెటింగ్ లో తనకు ఏకంగా నలభై లక్షలు వస్తాయి. ఆ డబ్బుతో లక్ష్మయ్యకు ఆపరేషన్ చేయొచ్చనే ఆనందంలో వున్న వెంకట్ జీవితంలోకి డేవిడ్(రవిశంకర్) వస్తాడు. దీంతో ఒక్కసారి వెంకట్ జీవితం తలకిందులుగా మారిపోతుంది. సిటీ మేయర్ జార్జ్ (శరత్) కొడుకు హత్య కేసు వెంకట్ మెడకి చుట్టుకుంటుంది. అసలు ఈ డేవిడ్, జార్జ్ ఎవరు? హత్య కేసులో వెంకట్ ఎలా ఇరుక్కున్నాడు? ఈ కేసుని నుంచి బయటపడ్డాడలేదా? ఇవన్నీ తెరపై చూడాలి.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అనే జోనర్ ఫిక్స్ చేసి, ట్రైలర్ కూడా అదే తరహాలో కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ దృష్టితోనే థియేటర్లోకి అడుగు పెడతాడు ప్రేక్షకుడు. ఆ అంచనాలతో చూసిన ఆడియన్స్ కు భజే వాయువేగం తొలి సగం ఆ వేగాన్ని అందుకోలేకపోతుంది. తండ్రి కొడుకుల ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ ఒకొక్క సన్నివేశం నింపాదిగా పేర్చుకుంటూ వెళ్ళాడు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి. ‘హీరోకు పెంచిన తండ్రిమీద విపరీతమైన ప్రేమ. తండ్రిని కాపాడుకోవడానికి ఎంత రిస్క్ అయిన చేస్తాడు’. ఈ పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి దాదాపు తొలి సగం అంతా గడిపేశారు. ఇటు వెంకట్, అటు రాజ్ ఇద్దరూ జీవితంలో స్థిరపడటానికి పడుతున్న ఇబ్బందులలో సహజత్వం వున్నప్పటికీ నేటితరం ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టు సన్నివేశాలు నడిపినట్లనిపించలేదు. జార్జ్, డేవిడ్ పాత్రల పరిచయం తర్వాత అయినా వేగం రావాల్సింది. కానీ ఇంటర్వెల్ వరకూ అసలు యాక్షన్, థ్రిల్ రెండూ కనిపించవు. అడుగడుగునా బ్రేకులు పడుతూనే వుంటాయి. అయితే ఇంటర్వెల్ కి ఇచ్చిన ఓ మలుపు ఆకట్టుకునేలా వుంటుంది.
తొలిసగం అంతా కథని పరిచయం చేయడానికే సమయం తీసుకున్న దర్శకుడు రెండో సగంలో మాత్రం టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్లుగా కొంత వేగంతో సన్నివేశాలని నడిపాడు. మేయర్ కొడుకు హత్య, డేవిడ్ గ్యాంగ్ వెంకట్ వెంటపడటం, హవాల, డ్రగ్స్ నేపధ్యం.. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒకొక్కటిగా రివిల్ అవుతూ ఆసక్తికరమైన మలుపులతోనే ముందుకు సాగుతుంది. ప్రీక్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాలు కూడా రక్తికట్టేలానే వుంటాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ముందే ఊహకు అందిపోతుంది. చివర్లో ఆవాహ నోటు రూపంలో ఓ కొసమెరుపు ఉన్నప్పటికీ అది సీక్వెల్ ని డిమాండ్ చేసేటంత కంటెంట్ వున్నదైతే కాదు.
కార్తికేయ హీరోగా కంటే ఒక క్యారెక్టర్ గా ఈ సినిమా చేయడం బావుంది. ఎక్కడా అనవసరమైన ఎలివేషన్స్ జోలికి పోలేదు. ఓ మామూలు కుర్రాడిలానే నటించాడు. ఈ జోనర్ కథలకి తన బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుంది. రాజ్ పాత్రలో చేసిన రాహుల్ చాలా రోజుల తర్వాత కనిపించాడు. తన వాయిస్ మాత్రం మళ్ళీ హ్యాపీ డేస్ ని గుర్తుకుతెచ్చింది. ఐశ్వర్య లక్ష్మి పాత్రని సంపూర్ణంగా మలచలేదు. ఏదో షాకింగ్ ఎలిమెంట్ లా వాడారు కానీ దానికి ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా మరీ సినిమాటిక్ గా వుంది. తనికెళ్ళ భరణి తన అనుభవం చూపించారు. డేవిడ్ పాత్రలో రవిశంకర్ పాత్ర బలంగా ఉంది. జార్జ్ పాత్ర మాత్రం తేలిపోయేలా వుంది.
ఈ కథకు పాటలు అనవసరం. కానీ ఒక పాట వుంది. అది తేలిపోయింది. నేపధ్య సంగీతంలో కూడా పెద్ద మెరుపులు లేవు. కెమెరాపనితనం మాత్రం డీసెంట్ గా వుంది. కథకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు వున్నాయి. తొలిసగానికి ఇంకా పదునుపెట్టాల్సింది. గుర్తుపెట్టుకునే మాటలు లేవు. పదునైన స్క్రీన్ ప్లేతో ఓ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ని చెప్పాలనేది దర్శకుడి ఆలోచన. అయితే ఈ ఐడియా ఫస్ట్ హాఫ్ లో కూడా మెప్పించేలా కథనం రాసుకొని వుంటే ఫలితం మరింత మెరుగ్గా వుండేది.
తెలుగు360 రేటింగ్ 2.5/5
-అన్వర్