Gam Gam Ganesha Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.5/5
-అన్వర్
ఆనంద్ దేవరకొండకు ‘బేబీ’ రూపంలో ఓ బాక్సాఫీస్ హిట్ పడింది. ఆ సినిమా యూత్ లో బాగా వైరల్ కావడంతో మంచి ఫాలోయింగ్ వచ్చింది. బేబీకి భిన్నంగా ఓ క్రైమ్ కామెడీ ‘గం గం.. గణేశా’ తో ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మరీ చిత్రం ఎలా సాగింది ? ఆనంద్ బేబీ హిట్ ని కొనసాగించాడా? ఈ క్రైమ్ కామెడీలోని కొత్తదనం ఏమిటి ?
గణేశ్ (ఆనంద్ దేవరకొండ) శంకర్ (ఇమ్మాన్యుయేల్) ఇద్దరూ అనాధలే. చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. గణేశ్‌కు ఓ ప్రేమకథ వుంటుంది. శ్రుతి (నయన్ సారిక)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. తను జీవితంలోకి వస్తే కుటుంబం లేని లోటు తీరుతుందని ఆశపడతాడు. కానీ శ్రుతి డబ్బున్న ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించి, ప్రేమించిన అమ్మాయి ముందు కాలర్ ఎగరేయాలని ప్రతిజ్ఞ పూనుతాడు. ఓ నగల దుకాణంలో రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్ ఒప్పుకుంటాడు. అయితే దొంగతనంలో జరిగిన ఓ పొరపాటు వల్ల ఆ డైమండ్ ని తానే అమ్మి డబ్బు చేసుకోవాలని భావిస్తాడు. ఆ డైమండ్ ని చెన్నై తీసుకెళ్తుండగా మధ్యలో పోలీసుల తనిఖీలు జరుగుతాయి. ఎక్కడ దొరికిపోతాననే భయంతో ఎదురుగా వున్న ఓ పెద్ద వినాయకుడి విగ్రహం తొండంలో దాన్ని పడేస్తాడు. ఆ విగ్రహాన్ని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్‌రెడ్డి (రాజ్ అర్జున్) ముంబై నుంచి ప్రత్యేకంగా తయారుచేయించి, ఊరికి తీసుకొస్తుంటాడు. తర్వాత ఏం జరిగింది? గణేష్ కి విగ్రహంలోని వజ్రం దొరికిందా? అసలు కిషోర్ రెడ్డి ప్లాన్ ఏమిటి? ముంబాయి నుంచి విగ్రహం తేవాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ తెరపై చూడాలి.
క్రైమ్ కామెడీ భలే గమ్మత్తయిన జోనర్. జరుతున్నది నేరం తెలిసినా ఆ నేరాన్నే నవ్విస్తూ చూపించడం ఓ కళ. అయితే ఆ టెక్నిక్ పట్టుకోవడం అంత తేలిక కాదు. ఓ క్రైమ్, నవ్వించడాని తగిన సరంజమా ఉన్నంత మాత్రాన ఈ సినిమాలు పండవు. కథ, కథనంతో పాటు పాత్రల అల్లిక కూడా బలంగా వుండాలి. గం గం.. గణేశా లో కూడా క్రైమ్ వుంది.. కామెడీ వుంది. అయితే ఆ రెండిటిని కలిపే అల్లికే బలంగా లేదు. గణేష్ పాత్రని పరిచయం చేస్తూ కథని మొదలుపెట్టాడు దర్శకుడు. తన సిల్లీ క్యారెక్టరైజేషన్ మొదట్లో నవ్విస్తుంది. అయితే ఆ ఎనర్జీని సినిమా అంతా కొనసాగించలేకపోయారు. తన తొలి ప్రేమ కథ కూడా ఏదో టైం పాస్ వ్యవహారంలానే వుంటుంది కానీ కథకు అంత ప్రాధాన్యత వున్న ట్రాక్ అయితే కాదు. పైగా ‘బేబీ’ హ్యాంగోవర్ లో ఆ సీన్స్ తీశారా? అనే అనుమానం కూడా కలుగుతుంది.
ఈ కథని రెండు కోణాల్లో నడిపాడు దర్శకుడు. వజ్రం దొంగతనం, ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి కోణంలో భారీ గణపతి విగ్రహం…ఈ రెండూ సమాంతరంగా సాగుతూ ఒక చోట కలిసిన తర్వాత.. వాట్ నెక్స్ట్ అనే ఆసక్తి ఐతే కలిగించారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా సెకెండ్ హాఫ్ పై క్యురియాసిటీని పెంచుతుంది. సెకండ్ హాఫ్ రాజావారు (సత్యం రాజేష్) గణేష్ ఉత్సవాలు చుట్టూ కథని నడిపారు. గణపతి విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు కిషోర్‌రెడ్డి గ్యాంగ్ ప్రయత్నాలు, డైమండ్ కోసం గణేశ్, శంకర్ వేసే వేషాలు కొన్ని నవ్వులు పంచుతాయి. అయితే మధ్యలో గణేశ్‌కు నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ)తో లవ్ ట్రాక్ పెట్టడం హ్యుమర్ కి అడ్డుతగిలింది. పిచ్చిపట్టిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్‌గా వెన్నెల కిషోర్ కాసేపు నవ్వించారు. అయితే క్లైమాక్స్ ని మరీ నవ్వులాట తీశాడు దర్శకుడు. ఒకదశలో ఆ కామెడీ కాస్త వెర్రితనంగా వుంటుంది.
గణేశ్ పాత్ర ఆనంద్ కు కొత్తే. మంచి ఎనర్జీ వున్న పాత్ర. కొన్ని చోట్ల ఆ ఎనర్జీ కనిపించింది. ఇంకొన్ని చోట్ల తెలిపోయినట్లు అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త మెరుగవ్వాలి. నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ.. ఇద్దరకీ పెద్ద ప్రాధాన్యత లేదు. ప్రగతి లుక్స్ మాత్రం వున్నాయి. కిషోర్రెడ్డిగా రాజన్, రుద్రగా కృష్ణ చైతన్య విలనిజం చూపించగా, శంకర్ గా ఇమ్మాన్యుయేల్, ఆర్గాన్ డేవిడ్‌గా వెన్నెల కిషోర్ కొన్ని నవ్వులు పంచుతారు.
చైతన్ భరద్వాజ్ పాటలు కథకు అడ్డుతగిలాయి. నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ డీసెంట్ గా వుంది. కొన్ని సింగిల్ లైనర్స్ పేలాయి. ఒక విలువైన వస్తువు చుట్టూ నడిచే క్రైమ్, అందులో నుంచి పుట్టే హాస్యం ఇది వరకూ చాలా సినిమాల్లో చూశాం. గం గం గణేశా పాయింట్ కూడా అదే. అయితే పాయింట్ నే ఇంకా క్రేజీగా చూపించాలనుకునే దర్శకుడి ప్రయత్నం అలరించేలా తెరపైకి రాలేదు.
తెలుగు360 రేటింగ్ 2.5/5
-అన్వర్