తెలంగాణ ఏర్పాటు చేస్తే… కరెంట్ ఉండదన్నారు. వారికి పాలన చేతకాదన్నారు. హైదరాబాద్ సగం ఖాళీ అవుతుందన్నారు. ఆ రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఉండదన్నారు. ఇంకా ఎన్నో మైనస్‌లు చూపించారు. కానీ ప్రజా ఆకాంక్ష ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయక తప్పలేదు. అయితే ముంచుకొస్తాయని అంచనా వేసిన… హెచ్చరించిన సమస్యలేమీ తెలంగాణను పీడించలేదు. సమర్థంగా ఎదుర్కొన్నారు. అధిగమించారు. పదేళ్ల ముందు తెలంగాణ.. ఇప్పుడు తెలంగాణను చూస్తే… అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివర్ణించాల్సిందే.
తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు.. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు స్పష్టమైన మార్పు ప్రజలకు కనిపిస్తోంది. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు వేశారు. ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పించడంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఊహించనంతగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తెలంగాణకు పెద్ద ఎత్తున వలస వస్తున్నప్రజల కారణంగా పెరుగుతున్న జనాభా వాల్ల వారి అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారినా అధిగమిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రం కన్నా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ సగం ఖాళీ అవుతుందన్న బెదిరింపులు వినిపించాయి. కానీ పదేళ్లలో జనం రెట్టింపు అయ్యారు. పదేళ్ల కిందట ఔటర్ రింగ్ రోడ్ లోపలే హౌసింగ్ ప్రాజెక్టులు ఉండేవి. కానీ ఇప్పుడు ఔటర్ దాటి ఇరవై కిలోమీటర్ల వరకూ నగరం విస్తరిస్తోంది. అందుకే రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పదేళ్లలో గట్టి ప్రయత్నాలు జరిగాయి. కరెంట్ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్వయం సమృద్ధి సాధించింది. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంది. ప్రజలకు తాగు, సాగునీరు విషయంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలను అధిగమించగలిగారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా కుళాయి సౌకర్యం కల్పించారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా తెలంగాణ
పదేళ్లు తెలంగాణ పయనాన్ని చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే.. మెరుగైన అభివృద్ది సాధించామన్న అభిప్రాయానికి రావొచ్చు. నియామకాల విషయంలో యువత అంచనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకోలేకపోయింది.దానికి ఉద్యమ సమయంలో వారు కల్పించిన ఆశలే కారణం. విడిగా చూస్తే తెలంగాణ ఎంతో మెరుగైన ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉపాధి కేంద్రంగా ఉంది. మొత్తంగా పదేళ్ల తెలంగాణ అద్భుతమైన జర్నీ అనుకోవచ్చు.