ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మరో నెల రోజుల పాటు జైల్లోనే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. కవిత బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై మే 27, 28న వాదనలు జరగగా తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అయితే, ఈ తీర్పును వెలువరించేందుకు మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
జూన్ 1 నుంచి ఈ నెల 29వరకు కోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో రిజర్వ్ చేసిన తీర్పు ఇప్పట్లో వెలువడే అవకాశం లేదు. కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు శుక్రవారమే ఈ బెయిల్ పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినా కేసు లిస్టు కాలేదు. దీంతో మరో నెల రోజులపాటు కవిత జైలులోనే ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.
కోర్టుకు సెలవులు ముగిశాక అంటే జులై మొదటి వారంలో రిజర్వ్ చేసిన తీర్పును హైకోర్టు వెలువరించనుంది.లిక్కర్ స్కామ్ లో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న కవిత అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు ఊరట దక్కుతుందో లేదోనని కవిత అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.