ఈ వేసవి… టాలీవుడ్ మొత్తం చల్లబడిపోయింది. ఒక్క హిట్టు లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోయింది. కొన్ని సినిమాల్ని జనం అస్సలు పట్టించుకోలేదు. మే 13 తరవాతైనా టాలీవుడ్ కోలుకొంటుందనుకొన్నారు. కానీ అదీ జరగలేదు. మేలో ఒకదాని తరవాత మరో ఫ్లాప్! అలా మే మొత్తం నష్టమే అన్నట్టు తయారైంది వ్యవహారం.
ఈ నెలలో రాశి పరంగా ఎక్కువ సంఖ్యలోనే సినిమాలొచ్చాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాతలకు సంతృప్తి ఇవ్వలేదు. మే 3న ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఆ ఒక్కటీ అడక్కు, ప్రసన్న వదనం ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకొన్నాయి. అయితే.. ఇవి రెండూ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. మే 10న రిలీజ్ అయిన ప్రతినిధి, కృష్ణమ్మ కూడా నిరాశ పరిచాయి. వీటికి కనీసం ప్రారంభ వసూళ్లు కూడా దక్కలేదు. ఎలక్షన్లు అయ్యాక బాక్సాఫీసు దగ్గర జోష్ మొదలవుతుందనుకొన్నారు. కానీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్లు మూసేశారు. మంచి సినిమాలు విడుదలైన తరవాతే.. థియేటర్లు ఓపెన్ చేస్తామని థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా తీసుకొన్న నిర్ణయం ఇది. దాంతో మే 17న కావల్సిన కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి సినిమాలు వదిలారు. కానీ ఫలితం రాలేదు. రాజు యాదవ్, లవ్ మి.. ఇలా వరుస ఫ్లాపుల పరంపర కొనసాగింది.
మే 31న మూడు సినిమాలొస్తే.. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయింది. విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నెగిటివ్ రివ్యూలు మూటగట్టుకొంది. వాటితో పోలిస్తే ‘గం గం గణేశా’, ‘భజే వాయు వేగం’ సినిమాలే బెటర్. కానీ వసూళ్లు మూడింటికీ డల్ గానే ఉన్నాయి. వీకెండ్ లో ఏమైనా కొన్ని టికెట్లు తెగితే.. అది విశ్వక్ సినిమాకే. మొత్తానికి ఈ నెలలో ఒక్క హిట్ కూడా పడలేదనే చెప్పాలి. రాజకీయాలు, ఐపీఎల్ ఇవి రెండూ థియేటర్లకు ప్రేక్షకుల్ని రానివ్వకుండా అడ్డుకొన్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలూ రాలేదు. వెరసి ‘మే’.. నష్ట’మే’ మిగిలచ్చింది.