కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీయకుండా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది..? ఎన్నికల ప్రక్రియ ముగుస్తోన్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచడానికి కారణం ఏంటి..? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టేందుకు బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందా..? బీజేపీ అనుసరిస్తోన్న విధానాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్రప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆ కేసును ముందుంచి తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రాన్ని బీజేపీ మార్చేస్తుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా రాధాకిషన్ రావు స్పష్టం చేయడంతో సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే కేసీఆర్ కు మరిన్ని చిక్కులు తప్పవు.
ఇప్పటికే తెలంగాణలో ఆగస్ట్ సంక్షోభం తప్పదని కాంగ్రెస్ ను హెచ్చరిస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించడమంటే కాషాయపార్టీకి అస్త్రం ఇవ్వడమేనని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీబీఐ బీజేపీ జేబు సంస్థ అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ద్వారా ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ తనదైన రాజకీయం చేసే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ ఎలాగైతే రాజకీయం చేయాలనుకున్నారో బీజేపీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అదే ప్లాన్ ఫాలో అవ్వాలనుకుంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ను సీబీఐ ఉచ్చులో బంధించి, బీఆర్ఎస్ మద్దతుతో రేవంత్ సర్కార్ ను కూల్చేందుకే బీజేపీ వ్యూహం మేరకు పదేపదే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తుందని అంటున్నారు.