సినిమా తీయడం ఒక కళ అయితే దాన్ని మార్కెట్ చేసుకోవడం మరో కళ. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి పరిశ్రమకి ఎన్నో కొత్తదారులు చూపారు. మార్కెట్, పబ్లిసిటీ ఆవశ్యకతని తెలియజేస్తూ ప్రమోషనల్ కార్యక్రమాలని కూడా సృజనాత్మకంగా వుండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో స్వయంగా చేసి చూపించారు. సినిమా పూర్తి చేసిన తర్వాత దర్శకుడు పోస్ట్ ని పక్కన పెట్టి.. పక్కా మార్కెటింగ్ అండ్ సేల్స్ మ్యాన్ అవతారం ఎత్తేస్తాడు జక్కన్న. ఇప్పుడు రాజమౌళి చూపిన దారిని నాగ్ అశ్విన్ పగడ్బందీగా ఫాలోఅవుతున్నట్లు కనిపిస్తోంది.
నాగ్ అశ్విన్ గత ఐదేళ్ళుగా ప్రాజెక్ట్ ‘కల్కి’ని తీర్చిదిద్దుతున్నాడు. వైజయంతి మూవీస్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రభాస్ అమితాబ్ కమల్ దీపిక.. ఇలా ఇండియన్ సూపర్ స్టార్స్ అంతా సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్, మార్కెట్ విషయంలో ఇంటర్నేషనల్ స్థాయి ఆలోచిస్తున్నాడు నాగ్ అశ్విన్.
శాన్ డియాగో కామిక్-కాన్ లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. అక్కడ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా కల్కి చరిత్రకెక్కింది.
మద్రాస్, ముంబై ఐఐటీలో ఈ సినిమా మేకింగ్ కోసం వాడిన ఇంజనీరింగ్ ని విద్యార్ధులకు డిమో ఇస్తూ ఓ కార్యక్రమం చేపట్టారు. సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడానికి కూడా కల్కి రైడర్స్ అంటూ దేశవ్యాప్తంగా ఓ ఆర్మీ సమూహం పోస్టర్ ని ప్రదర్శించేలా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక సినిమాలోని ఒకొక్క పాత్రని రివిల్ చేయడానికి ఎంచుకున్న విధానం కూడా వినూత్నంగా వుంది. ఈ సినిమా కోసం బుజ్జి అనే ఓ కారుని తయారు చేశారు. ఆనంద్ మహేంద్ర సంస్థ ఈ కార్ ఇంజనీరింగ్ లో భాగస్వామి అయ్యింది. ఈ కార్ లాంచ్ కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పెద్ద వేడుక నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ వేడుక అందరి ద్రుష్టిని ఆకర్షించింది.
ఒక కారు లాంచ్ చేయడానికి అంత వేడుక చేయాలా ? అని అనుకున్నారంతా. అయితే ఈ వేడుక వెనుక పెద్ద ప్రచార వ్యుహన్నే ప్లాన్ చేశారు నాగ్ అశ్విన్. బుజ్జి కార్ ని ప్రముఖులంతా డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య, ఫార్ముల వన్ రేసర్ కార్తికేయన్ మొదలుకొని చాలా మంది సెలబ్రిటీలతో దేశవ్యాప్తంగా హాల్ చేస్తూ నిత్యం వార్తల్లో వుంటుంది బుజ్జి. అలాగే ఎలన్ మస్క్ ని ట్యాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ బుజ్జి గురించి పెట్టిన ట్వీట్ కూడా వైరల్ అయ్యింది.
సినిమా విడుదలకు ముందే యానిమేషన్ సిరిస్ ని లాంచ్ చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఈ కొత్తవరవడికి శ్రీకారం చుడుతూ భైరవ బుజ్జి యానిమేషన్ సిరిస్ ని అమెజాన్ లో విడుదల చేశారు. దీనికి కూడా చాలా మంచి స్పంధన వస్తోంది. మొత్తానికి ఏ అవకాశం వదులుకోకుండా సినిమాని అన్నీ కోణాల్లో గ్లోబల్ ఆడియన్స్ కి చేరేలా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు నాగ్ అశ్విన్.