తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా సీట్లు సాధిస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అసలు బీఆర్ఎస్ ను పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో దున్నేసేందుకు రెడీ అయిపోయిన కేసీఆర్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వస్తుందని చెప్పేందుకు ఎగ్జిట్ పోల్స్ సాహసించలేదు. ఈ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్కు భారీ షాక్.
హైదరాబాద్ చుట్టుపక్కన బీఆర్ఎస్ విజయాలు సాధించింది. ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ వంటి చోట్ల భారీ విజయాలు నమోదు చేయాలి. కానీ ఆయా నియోజకవర్గాల్లో డిపాజిట్లు వస్తాయని కూడా ఎవరూ చెప్పడం లేదు. అత్యంత యాక్యురసీ ఉన్న సర్వే సంస్థల్లో ఒకటి అయిన యాక్సిస్ మై ఇండియా బీఆర్ఎస్కు పదమూడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. నిజంగా ఈ స్థాయి ఓట్లు వస్తే బీఆర్ఎస్ భూస్థాపితమైనట్లే.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ది ఘోరపరాజయం కాదు . గట్టి పోటీనే ఇచ్చింది. 39 అసెంబ్లీ సీట్లను సాధించింది. కానీ ఐదు నెలల్లోనే ఇంకా ఘోరంగా పతనం అయ్యారంటే కోలుకోవడం చిన్న విషయం కాదు. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ లేకుండా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తాయి. కేసీఆర్, కేటీఆర్ తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓడలు బండ్లు అవుతాయని.. బీఆర్ఎస్ నిరూపిస్తోంది.