ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రదారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నది కేసీఆరేనా..? మాజీ మంత్రి హరీష్ రావు సహాయంతో ప్రభాకర్ రావును ఇంకొంత కాలం అమెరికాలోనే ఉండాలని కేసీఆర్ రాయబారం పంపారా..? ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే తమ బాగోతం బయటపడుతుందనే హరీష్ ను కేసీఆర్ ఇటీవల విదేశాలకు పంపారా..?
ఇప్పుడీ అంశాలపైనే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్ పరిణామాలను అంచనా వేసి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా అక్కడే ఉండాలని కేసీఆర్ చెప్పినట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిగ్ బాంబ్ పేల్చారు. ఇటీవల విదేశాలకు వెళ్ళిన హరీష్ రావు, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుతో భేటీ అయ్యారని ఇప్పటికిప్పుడు ఇండియాకు రావొద్దని ఆయనకు హరీష్ సూచించారని సంచలన ఆరోపణలు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఈ అంశంపై హరీష్ రావు స్పందించారు. తాను మే నెలలో విదేశాలకు వెళ్ళిన మాట వాస్తవమేనని, కాకపోతే ప్రభాకర్ రావును కలిసినట్లు కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే తాను ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని , కోమటిరెడ్డి సిద్దమా..? అని సవాల్ చేశారు. మొత్తానికి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ టాపిక్ గా మారాయి.