మరి కొద్ది గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు సింహ భాగం తెలుగు దేశం జన సేన బిజెపి కూటమి కి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి గత కొన్ని ఎన్నికల లో స్థిరమైన ట్రాక్ రికార్డు కలిగిన ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ కూడా కూటమి 98 నుండి 120 సీట్ల వరకు సాధిస్తుందని వైఎస్ఆర్సిపి 55 నుండి 77 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలకు కౌంటర్ అన్నట్లుగా సాక్షి కొన్ని ఆర్టికల్స్ ప్రచురించింది. ఎగ్జిట్ పోల్స్ తమ వైపే ఉన్నాయని నిరూపించుకునేందుకు చేసిన ఈ ప్రయత్నంలో సాక్షి తడబడి ఒకే ఆర్టికల్ లో పరస్పర విరుద్ధమైన వాదనలు చేసింది.
అధిక శాతం సర్వేలు వైకాపా వైపే మొగ్గు అంటూ వాదన:
ముందు గా సింహ భాగం సర్వేలు వైఎస్ఆర్సిపి కి అనుకూలంగా ఉన్నాయని చెబుతూ ఊరు పేరు తెలియని అనేక సంస్థల సర్వేలని ప్రచురించి కూటమి కి విజయం లభిస్తుందని అంచనా వేసిన సర్వేల కంటే వైఎస్ఆర్సిపి కి విజయం లభిస్తుందని అంచనా వేసిన సర్వేలు అధికంగా ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేసింది. 50 శాతానికి పైగా ఓట్ల తో వైకాపా అధికారం లో కి రానున్నట్లు ఈ సర్వేలన్నీ చెబుతున్నాయని వ్రాసుకొచ్చింది. తమ కి వ్యతిరేకమైన ఫలితాలని అంచనా వేసిన సంస్థలకి దురుద్దేశాలని ఆపాదించింది. వీటిలో కొన్ని బిజెపి భజన సంస్థ ల ని ముద్ర వేసింది. ఇంకొక సంస్థ కి ఈనాడు తో భాగస్వామ్యం ఉందని వ్రాసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది.
ప్రజల లో ఎక్కువ విశ్వసనీయత ఉన్న ఇండియా టుడే సర్వేని కౌంటర్ చేయ బోయి తడబాటు:
అయితే ప్రజల లో ఎక్కువ విశ్వసనీయత ఉన్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ని నమ్మాల్సిన అవసరం లేదని సాక్షి వ్రాసుకొచ్చింది. బిజెపి కి భజన చేసే “ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా” వంటి కొన్ని సంస్థలు మాత్రమే కూటమి కి విజయం లభిస్తుందని అంచనా వేశాయని చెప్పుకొచ్చింది. తద్వా రా కేవలం బిజెపి మెప్పు పొందేందుకు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ఈ రకమైన ఫలితాలను ప్రకటించిందని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడి దాకా కూడా బాగానే ఉంది.
అంత లోనే ఇంకొక ఆణిముత్యం లాంటి వ్యాఖ్య చేసింది. అసలు ఈ సంస్థ ఆరు నెలల క్రితం జరిగిన మధ్య ప్రదేశ్ ఛత్తీస్గడ్ ఎన్నికల లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేసింది అని, కానీ ఆ రెండు రాష్ట్రాల్లో నూ బిజెపి విజయం సాధించిందని, కాబట్టి ఈ సంస్థ అంచనాలు నిజం అవ్వాల్సిన అవసరం లేదన్నట్లు వాదించింది. ఒకవైపు ఏమో బిజెపికి భజన చేసే సంస్థ కావడం వల్లనే తమకు వ్యతిరేకం గా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందని చెబుతూనే బిజెపి గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఇటీవలే కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలను ఆ సంస్థ ప్రకటించిందని మరోవైపు వ్రాస్తూ వచ్చింది. ఈ సంస్థ నిజంగా బిజెపి భజన సంస్థ అయి ఉంటే ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఎందుకు ప్రకటించిందో సాక్షికే తెలియాలి.
కొస మెరుపు:
కొస మెరుపు ఏమిటంటే నిన్న విడుదలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల కు అచ్చు గుద్దినట్లుగా సరి పోయాయి. మరి కూటమి కి 98 నుండి 120 సీట్లు వస్తాయి అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 55 నుండి 77 సీట్లకి పరిమితం అవుతుందని ఈ సంస్థ వేసిన అంచనా ఎంత వరకు నిజం అవుతుందన్నది కొద్ది గంటల్లో తేలిపోతుంది.