వైసీపీకి ఓటమి భయం గట్టిగానే పట్టుకుందా…? కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వచ్చినా సొంత పార్టీ నేతలకే గెలుస్తామన్న ధీమా లేకుండా పోయిందా…? ఆ ఓట్లే కొంపముంచుతాయని వైసీపీ ఫిక్సయిందా…?
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ నిర్ణయాలు, భయం పై ప్రశ్నలకు అవుననే సమాధానలిస్తున్నాయి. గెలుస్తామని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, నెక్ టూ నెక్ ఫైట్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమ కొంప ముంచుతాయని వైసీపీ ఫిక్సయినట్లుంది.
ఏపీలో ఏ సర్వే సంస్థలు సర్వేలు చేసినా, ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి విషయాలు చెప్పినా… కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల శాతంలో భారీ తేడాలు లేవు. కానీ, సీట్ల వరకు వచ్చే సరికి కూటమికి అనుకూలంగా సీట్ల సంఖ్య పెరుగుతుందన్న భావన నెలకొంది. వైసీపీ సొంత సర్వేలోనూ ఇదే తేలిందన్న చర్చ వైసీపీ వర్గాల్లో ఉంది. అదే జరిగితే గతంలో పెద్దగా పట్టించుకోని పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కీలకం అవుతాయి. ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూటమికి గంపగుత్తగా పడ్డాయన్నది ఓపెన్ సీక్రెట్. దీంతో వైసీపీ ఓటమికి పోస్టల్ ఓట్లే కారణం అవుతాయన్న అంచనాల నేపథ్యంలో వైసీపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వార్ మొదలుపెట్టింది.
సీఈవో మీనా ఓకే చెప్పినా, కేంద్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పినా, ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో మేం జోక్యం చేసుకోం అని హైకోర్టు చెప్పినా… వైసీపీ ఒప్పుకోవటం లేదు. సీల్ లేని ఓట్లను లెక్కలోకి తీసుకోవద్దు, అవి చెల్లవని తీర్పునివ్వాలంటూ ఇప్పుడు ఏకంగా సుప్రీం తలుపుతట్టింది.