ఈవారం విడుదల కాబోతున్న సినిమాల్లో ‘మనమే’ ఒకటి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా ఇది. శర్వానంద్ – కృతి శెట్టి జంటగా నటించారు. ప్రమోషన్లు ఊపందుకొన్నాయి, ట్రైలర్ కూడా వచ్చేసింది. సినిమా మొత్తం కలర్ఫుల్ గా అనిపిస్తోంది. ఓ హిందీ సినిమాలాంటి టింజ్ కనిపిస్తోంది. దానికి తోడు, పాటల పరంగానూ ప్రయోగం చేసింది చిత్రబృందం. ఇందులో ఏకంగా 16 పాటలున్నాయి. తెలుగు సినిమాల్లో ఈమధ్య పాటలు మరీ తక్కువైపోయాయి. 4 పాటలుంటే చాలు అంటున్నారు. పాటలకు పెద్ద స్కోప్ కూడా దొరకడం లేదు. ‘కట్ చేస్తే పాట’ లాంటివి ఉండడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ సినిమాలో పదహారు పాటలకు చోటిచ్చారంటే.. నిజంగా సాహసమే అనుకోవాలి.
అయితే ఇవన్నీ బిట్ సాంగ్స్. పాటలోని సందర్భాన్ని బట్టి, బిట్ సాంగ్స్ వస్తుంటాయి. కథతో పాటు పాటలూ ప్రయాణం చేస్తాయని, అందుకే ఇన్ని పాటలు పెట్టామని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెబుతున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ, కరణ్ జోహార్ తీసే హిందీ సినిమాల్లో సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు చూస్తుంటాం. తెలుగులో ఇన్ని పాటలకు చోటివ్వడం నిజంగా ఓ రికార్డ్. ఈ సినిమాకు అబ్దుల్ హేషమ్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ సినిమాల్లో మంచి పాటలు అందించారాయన. అదే నమ్మకంతో ఈ సినిమాలో పాటలకు ఎక్కువ స్కోప్ ఇచ్చారేమో..!