కొద్ది గంటలు.. ఇంకొద్ది గంటలు మాత్రమే. ఏపీలో సీఎం సంహాసనంపై కూర్చునేది ఎవరో తేలేందుకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో వైసీపీ – కూటమి నేతల్లో ఉత్కంఠ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. క్షణం.. క్షణం గడిచే కొద్ది ఊపిరి బిగపట్టి మరీ ఈ ఫలితాల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల అధినేతలలో ఓ రకమైన వైబ్రేషన్ నెలకొంటే అభ్యర్థులను మాత్రం టెన్షన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఎప్పుడు తెల్లారుతుంది.. ఎప్పుడు ఫలితాలు వస్తాయిరా నాయనా.. ఈ టెన్షన్ భరించలేకున్నాం.. అని ప్రధాన పార్టీల అభ్యర్థులు లోలోపల మధనపడుతున్నారు. ఓ వైపు నైరుతి రుతుపవనాల పలకరింపుతో వాతావరణం అంతా చల్లబడగా… ఏపీ పాలిటిక్స్ మాత్రం ఫలితాల వేళ మాంచీ ఫైర్ మీద కనిపిస్తున్నాయి.
జాతీయ స్థాయి ఫలితాలపై ఓ అంచనా కనిపిస్తోన్నప్పటికీ ఏపీ ఫలితాలపైనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచిన వారు పాతుకుపోతారు.. ఓడిన వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే అటు చంద్రబాబు, ఇటు జగన్ మోహన్ రెడ్డిలు నువ్వా- నేనా అనే తరహాలో మొహరించి ఓ యుద్దమే చేశారు.
ఫలితంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూటమి విజయం ఖాయమని తెల్చేసినా ఎక్కడో ఓ మూల చిన్న సందేహం ఇరు పార్టీల కార్యకర్తలను, నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది . ఎగ్జిట్ పోల్స్ ఎగ్జట్ గా ఉంటాయా..? లేదా అని టెన్షన్ పడుతున్నారు. దేశవ్యాప్తంగా హావోల్టేజ్ క్రియేట్ చేసిన ఏపీ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.